Oscars 2026: అస్కార్స్ 2026 రేసులో తెలుగు సినిమాలు.. బరిలో నిలిచిన ఐదు చిత్రాలు ఇవే!

Oscars 2026: అస్కార్స్ 2026 రేసులో తెలుగు సినిమాలు.. బరిలో నిలిచిన ఐదు చిత్రాలు ఇవే!

ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ కు  సంబంధించి ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 2026లో జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం భారతదేశం నుంచి ఏ చిత్రాన్ని అధికారికంగా పంపించాలనే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి మొత్తం 24 సినిమాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు ఉన్నాయి. 

జాబితాలో ఉన్న తెలుగు సినిమాలు ఇవే!

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. అందులో తెలుగు నుంచి 'పుష్ప 2: ద రూల్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'కన్నప్ప', 'కుబేర',  'గాంధీతాత చెట్టు' అనే చిత్రాలు ఉన్నాయి. వీటిలో పుష్ప 2 లాంటి భారీ బడ్జెట్ సినిమా ఉండడం విశేషం. అదే విధంగా, ఇతర భాషల నుంచి కూడా బలమైన సినిమాలు పోటీలో ఉన్నాయి.

 

హిందీ నుంచి ఐ వాంట్ టూ టాక్, తన్వీ ది గ్రేట్, ద బెంగాల్ ఫైల్స్, హోమ్‌బౌండ్, కేసరి 2, సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్, హ్యుమన్స్ ఇన్ ద లూప్, జగ్నుమా, ఫూలే, పైర్ ఉన్నాయి. ఇక మరాఠీ నుంచి అయితే  ఆరు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. కన్నడ, మణిపురి నుంచి ఒక్కొక్క సినిమా ఉంది. ఒక మూకీ (నిశ్శబ్ద) సినిమా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సినిమాలన్నీ ఎంపిక ప్రక్రియలో తుది దశలో ఉన్నాయి. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) జ్యూరీ సభ్యులు ఈ సినిమాలను పరిశీలించి, ఓటింగ్ ద్వారా భారతదేశం తరపున ఆస్కార్స్‌కు పంపించాల్సిన చిత్రాన్ని నిర్ణయిస్తారు.

 ఆస్కార్స్‌కు అధికారికంగా 'హోమ్‌బౌండ్' ఎంపిక


నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వచ్చిన 'హోమ్‌బౌండ్' చిత్రం ఆస్కార్స్‌కు భారత్ తరపున అధికారికంగా ఎంపికై చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై విమర్శకుల ప్రశంసలు అందుకొని, తన సత్తాను చాటుకుంది. ముఖ్యంగా, ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీని వరల్డ్ ప్రీమియర్ జరిగింది. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఆ తర్వాత, 2025లో జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లలో కూడా ఈ సినిమా ప్రదర్శితమైంది. ఈ ఫెస్టివల్స్‌లో సినిమా చూసిన విదేశీ విమర్శకులు, ప్రేక్షకులు 'హోమ్‌బౌండ్'కు అద్భుతమైన స్పందన ఇచ్చారు. కథ, దర్శకత్వం, నటీనటుల నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ వంటి నటీనటుల అద్భుతమైన నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఇంతటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ సినిమా, సెప్టెంబర్ 26, 2025న భారతదేశంలో విడుదల కానుంది. 

 

మన సినిమాలకు ఆస్కార్‌ లభించే అవకాశం ఉందా?

గతంలో భారతీయ నేపథ్యంతో తెరకెక్కిన కొన్ని డాక్యుమెంటరీలకు ఆస్కార్ లభించింది. కానీ, 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత, మన దేశంలో కూడా ఆస్కార్ అవార్డ్ గురించి అవగాహన పెరిగింది. ఇది ఒక సినిమాకు ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యున్నత గుర్తింపుగా అందరూ భావిస్తున్నారు.

ఈసారి తెలుగు సినిమాలు బరిలో నిలవడం గొప్ప విషయం. అయితే, ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకోవడానికి బలమైన అంతర్జాతీయ ప్రచారం, మార్కెటింగ్ చాలా కీలకం. పుష్ప 2 లాంటి సినిమాలు అంతర్జాతీయ ప్రేక్షకులకు బాగా చేరువయ్యే అవకాశం ఉంది. అలాగే, కథాబలం, నిర్మాణ విలువలు, నటీనటుల నైపుణ్యం వంటి అంశాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈసారి ఏ సినిమా భారత్ తరపున అధికారికంగా వెళ్తుందో, ఆ సినిమా ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.