DIGపై లైంగిక ఆరోపణలు చేసిన ముంబై బాలిక మిస్సింగ్

DIGపై లైంగిక ఆరోపణలు చేసిన ముంబై బాలిక మిస్సింగ్

డీఐజీ నిషికాంత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన 17 ఏళ్ల బాలిక సోమవారం రాత్రి నుంచి కనబడకుండాపోయింది. బాలిక తండ్రి మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి సోమవారం కాలేజీకి వెళ్ళింది. అక్కడ ఎవరో ఆమెను కలుసుకొని ఫోన్ నంబర్ కూడా తీసుకున్నారు. ఆమె కాలేజీ నుండి వచ్చి.. నేరుగా గదిలోకి వెళ్లి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి మా అమ్మాయి ఇంట్లో లేదు. తన గదిలో సూసైడ్ నోట్ రాసి పెట్టి వెళ్లింది. DIG వేధింపుల వల్ల విసుగుచెంది తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. పోలీసులు తలచుకుంటే మా కూతురు ఎక్కడ ఉందో వెంటనే కనిపెట్టేవారు, కానీ వారు ఆ పని చేయడంలేదు. ఎందుకుంటే, అవతలి వ్యక్తి డీఐజీ హోదాలో ఉన్నాడు. అందుకే అతనిపై ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. ముఖ్యమంత్రి ఈ విషయంలో కల్పించుకొని మాకు న్యాయం చేయాలి. మాకు ఎటువంటి భద్రత కూడా లేదు. ఎవరైనా మమ్మల్ని ఏమైనా చేయవచ్చు. మా కుటుంబం మొత్తం భయంభయంగా బతుకుతున్నాము. రేపు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉన్నా’మని బాలిక తండ్రి అన్నారు.

బాలిక సోమవారం రాత్రి 11:30 గంటలకు స్వచ్ఛందంగా ఇంటి నుండి బయటకు వెళ్తున్న వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న డీఐజీ నిషికాంత్ మోర్‌ను ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేశారు. ఆయనపై సంబంధిత సెక్షన్ల కింద గత డిసెంబర్ 26న కేసు నమోదైంది.