ప్రెజర్​ పెంచితే పుటుక్కు.. ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్​ భగీరథ పైపులైన్లు​

ప్రెజర్​ పెంచితే పుటుక్కు..  ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్​ భగీరథ పైపులైన్లు​
  • ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్​ భగీరథ ఇంట్రా పైపులైన్లు​
  • ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరోదిక్కు లీకులు
  • అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్  లోపాలు
  • వేల కోట్లు ఖర్చు చేసి పాత ఇన్​ఫ్రాస్ట్రక్చర్​నే వాడిన గత సర్కార్​
  • సబ్​ కాంట్రాక్టర్లంతా లోకల్​ లీడర్లే.. సమస్య వస్తే పట్టించుకుంటలే
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

నెట్​వర్క్, వెలుగు:  ట్యాంకుల నుంచి నీళ్లు వదలంగనే ప్రెజర్​కు పైపులు పుటుక్కుమంటున్నయ్. ఏ టౌన్​లో చూసినా, ఏ పల్లెలో చూసినా పైపులైన్లకు  పగుళ్లు, పర్రెలే! ఓ దిక్కు రిపేర్లు​ చేస్తే మరో దిక్కు లీకులు!! గత బీఆర్ఎస్​ సర్కారు గొప్పగా చెప్పుకున్న మిషన్​ భగీరథ స్కీములోని ఇంట్రాపైపులైన్ల తీరిది. ఇలాంటి పైపుల ద్వారా తాగునీళ్లు ఎట్ల సప్లై చేయాలో తెలియక జిల్లాల్లో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నరు. ప్రత్యామ్నాయంగా  గ్రామాల్లోని పాతబోర్లను వినియోగంలోకి తెస్తున్నరు. భగీరథ నీళ్లు వచ్చే అవకాశం లేని చోట కొత్తగా హ్యాండ్​బోర్లు వేయిస్తున్నరు. ఉన్నవాటికి రిపేర్లు చేయిస్తున్నరు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నరు. ఏమాత్రం క్వాలిటీ లేని పాత ఇంట్రాపైపులైన్​ను మారిస్తే తప్ప మున్ముందు మిషన్​ భగీరథతో ఇంటింటికీ నీటి సరఫరా అసాధ్యమని జిల్లా కలెక్టర్లు, స్పెషల్​ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నట్లు తెలిసింది. 


రాష్ట్రవ్యాప్తంగా 96 నియోజకవర్గాలు కవర్​ అయ్యే లా 23,890 రూరల్, 121 అర్బన్​ హ్యాబిటేషన్లకు 2016లో మిషన్ భగీరథ స్కీం చేపట్టారు. ఇందుకోసం రూ. 46,123 కోట్లు కేటాయించారు. 1.50 లక్షల కిలో మీటర్ల వాటర్​ గ్రిడ్​లో ట్రీట్​మెంట్​ప్లాంట్ల నుంచి సెగ్మెంట్లకు వెళ్లే మెయిన్ ట్రంక్ లైన్లతో పాటు ఇంట్రా పైపులైన్లు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ చాలా చోట్ల ఎక్కడికక్కడ పాత ఇన్​ఫాస్ట్రక్చర్​ను అడ్డగోలుగా వాడేశారు. పాత ట్యాంకులకే కలర్​ పూసి భగీరథలో కలిపేశారు. ఎస్సీ కాలనీలతోపాటు పాత లైన్​ పూర్తిగా దెబ్బతిన్నచోట్ల మాత్రమే కొత్తగా ఇంట్రాపైపులైన్​ వేశారు. ఈ పనులను కూడా సబ్​ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వాళ్లు అస్తవ్యస్తంగా చేశారు. లో క్వాలిటీ పైపులను తక్కువ లోతులో వేయడంతో  చిన్నచిన్న వాహనాలు వెళ్లినా పుటుక్కుమంటున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో 80 నుంచి 90 శాతం, టౌన్లలో 70 నుంచి 80 శాతం ఇంట్రాపైపులైన్​ పాతదే వాడుకోవడంతో కొద్దిపాటి ప్రెజర్​ను కూడా తట్టుకోలేక పగిలిపోతున్నాయి. పైపులు పగులుతాయనే భయంతో ట్యాంకుల నుంచి తక్కువ ఫోర్స్​తో వాటర్​ వదిలితే చివరి కాలనీలకు నీళ్లు చేరడం లేదు. ట్రీట్మెంట్​ప్లాంట్లకు దూరంగా ఉన్న విలేజ్​లది మరో సమస్య. మెయిన్​గ్రిడ్​ నుంచి గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పైపులైన్ల డయా తక్కువగా ఉండడం, పైపుల క్వాలిటీ బాగాలేకపోవడంతో తక్కువ ప్రెజర్​తో నీటిని పంపాల్సి వస్తున్నది. దీంతో రోజుకోసారి నిండాల్సిన ట్యాంకులు వారానికోసారి కూడా నిండడం లేదు.

స్పందించని సబ్​ కాంట్రాక్టర్లు

అగ్రిమెంట్​ ప్రకారం.. మిషన్ భగీరథ మెయిన్ గ్రిడ్ పనులు చేసిన కాంట్రాక్ట్​ సంస్థలే ట్రంక్​ లైన్లతో పాటు హ్యాబిటేషన్లలో ఓవర్​హెడ్ ​ట్యాంకుల నిర్వహణ బాధ్యతలను చూసుకోవాలి. పైపులైన్లు డ్యామేజీ అయినా, నీటి పంపింగ్​లో ఆలస్యమైనా ఏజెన్సీలదే బాధ్యత. ఈ ఏజెన్సీలకు ప్రభుత్వంతో 2027 వరకు ఒప్పందం ఉంది. ఐదేండ్ల పాటు ఏమైనా లోపాలు తలెత్తితే వాటికి మెటీరియల్​ఖర్చును భరించి రిపేర్లు చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదే. ఆ తర్వాత ఐదేండ్లు మెటీరియల్ ఖర్చును గవర్నమెంట్​ భరించాలి. కానీ, గత బీఆర్ఎస్​ పాలనలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా చోట్ల కాంట్రాక్టు సంస్థలు.. లోకల్​ లీడర్లకే  సబ్ కాంట్రాక్టు ఇచ్చాయి. దీంతో ఏదైనా సమస్య వస్తే సబ్ కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో నీటి సరఫరాకు ఆటంకాలు కలుగుతున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇది ఒక సమస్య అయితే వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్లలో రేయింబవళ్లు మోటార్లను నడపడం వల్ల తరచూ రిపేర్​కు వస్తున్నాయి. ఏజెన్సీలు వీటిని ఎప్పటికప్పుడు రిపేర్​ చేయకపోవడం వల్ల ఒకటి, రెండు మోటార్లు దెబ్బతిన్నా ఆ ఎఫెక్ట్​ వందల హ్యాబిటేషన్లపై పడుతున్నది. ఇక మెయిన్​ గ్రిడ్ లో ఎక్కడైనా పైపులైన్​ పగిలినా, లీకయినా 48 గంటల్లో రిపేర్ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉన్నప్పటికీ రెండు, మూడురోజులకుపైగా పడుతున్నది. మళ్లీ వాటర్ ఫ్లో అందుకొని చివరి హ్యాబిటేషన్లకు చేరేందుకు వారం పడుతున్నది ఆఫీసర్లు చెప్తున్నారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పర్యవేక్షణ కోసం జిల్లాలకు స్పెషల్​ఆఫీసర్లను కూడా నియమించింది. ఎక్కడ సమస్య తలెత్తినా 24 గంటల్లో పరిష్కరించేలా మిషన్​భగీరథ, ఆర్​డబ్ల్యూఎస్​, పంచాయతీరాజ్​ ఆఫీసర్లకు ఆదేశాలున్నాయి. కానీ, ఫీల్డ్​ లెవల్​లో భగీరథ గ్రిడ్​ నుంచి తక్కువ ప్రెజర్​తో వస్తున్న వాటర్ గ్రామాలకు చేరకపోవడం, ట్యాంకుల నుంచి రిలీజ్​చేస్తే ఇంట్రా పైపులైన్లు ఎక్కడికక్కడ పగులుతుండడం వల్ల తాము ఏమీచేయలేకపోతున్నామని కలెక్టర్లకు మొరపెట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్​ చేయడంతో మిషన్​భగీరథ నీళ్లు అందని ఏరియాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం స్పెషల్​ డెవలప్​మెంట్​ఫండ్​ కింద ఎమ్మెల్యేలకు కేటాయించిన ఫండ్స్​ను వాడుకోవాలని సూచించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఫీల్డ్​ స్టాఫ్​ ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆఫీసర్లు గ్రామాల్లోని పాత బావులను, బోర్లను, చేతిపంపులను వినియోగంలోకి తీసుకువస్తున్నారు. బోర్లు పడని చోట్ల ట్యాంకర్ల ద్వారా వాటర్​ సప్లై చేస్తూ భగీరథ ఇబ్బందుల నుంచి జనాలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నారు.

భగీరథ రాకపాయె.. హ్యాండ్ ​బోర్లే దిక్కాయె

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బాబ్జీపేటకు మిషన్ భగీరథ గ్రిడ్​ నుంచి వాటర్​ అందడం లేదు. 26 కిలోమీటర్ల దూరాన ఉన్న ఇచ్చోడ పంపుహౌస్​ నుంచి ప్రెజర్​లేక బాబ్జీపేట ట్యాంక్​కు నీళ్లు చేరడం లేదు.  గిరిజనులు తాగునీటికి అల్లాడుతుండడంతో ఆఫీసర్లు ఇటీవల ఐదు హ్యాండ్​బోర్లు వేయించారు. వాటి ద్వారా దాహం తీర్చుకుంటున్నారు.

తరచూ లీకేజీలు..  

నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీతోపాటు కొండమల్లేపల్లి మండలంలోని 15 గ్రామాలకు తాగు నీరందించే  భగీరథ పైప్ లైన్ తరుచూ లీకవుతున్నది. దీంతో  జనం ఇబ్బందులు తీర్చేందుకు బోర్లు, ట్యాంకర్ల ద్యారా వాటర్​ సప్లై చేస్తున్నారు.

13 బోర్లు వేసుకొని..  

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండలో  మిషన్ భగీరథ కింద నాసిరకం పైపులు వేయడంతో తరుచూ లీకేజీలతో నీటి సమస్య తలెత్తుతున్నది. దీంతో గ్రామస్తులు చెరువు శిఖంలో 13 బోర్లు వేసుకొని, వాటి నుంచి ఇండ్లకు నల్లాలు పెట్టుకొని దాహం తీర్చుకుంటున్నారు.

 రిపేర్లతో గట్టెక్కిస్తున్నరు..

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాణి మండలంలోని గోపెరా గ్రామానికి మిషన్​భగీరథ నీళ్లు వారానికి ఒకసారే వస్తున్నాయి. గ్రిడ్​ నుంచి ప్రెజర్​లేకపోవడం, లీకేజీలే సమస్యకు కారణం. దీంతో ఆఫీసర్లు బోర్లకు రిపేర్లు చేయించి ఎండాకాలం గట్టెక్కిస్తున్నారు.

20 ఏండ్ల నాటి ఆర్​డబ్ల్యూఎస్​ స్కీమే ఆధారం

పెద్దపల్లి పట్టణంలో మిషన్ భగీరథ ఫెయిల్​​ అయింది.  రూ.34 కోట్లతో రెండు ట్యాంకులు, 118 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం చేపట్టారు. పనుల్లో క్వాలిటీ లేక మెయిన్​గ్రిడ్​కు లింక్​ చేయగానే ఇంట్రాపైపులు ఎక్కడికక్కడ పగిలిపోతున్నాయి. దీంతో ఈ స్కీమును నెల కింద పక్కనపెట్టిన ఆఫీసర్లు 20 ఏండ్ల కింద కాకా వెంకటస్వామి హయాంలో ప్రారంభించిన ఆర్​డబ్ల్యూఎస్ స్కీమ్​పై ఆధారపడి పెద్దపల్లిలో వాటర్​ సప్లై చేస్తున్నారు.

భగీరథ.. అదే వ్యధ

గ్రేటర్ వరంగల్ సిటీలో మిషన్​ భగీరథ, అమృత్​ స్కీంలో భాగంగా 217 కిలోమీటర్ల మెయిన్ పైపులైన్​​, 2,767 కిలోమీటర్ల ఇంట్రాపైపులైన్​ వేశారు. ఇందులో 59.3 కిలోమీటర్ల మెయిన్​ పైపులైన్​, 1,393 కిలోమీటర్ల  ఇంట్రా పైపులైన్​ పాతది కావడంతో  వాటర్ ఫ్లోకు తట్టుకోలేక పగులుతున్నాయి. కమిషనర్​ అశ్వినీ వాఖడే ఆధ్వర్యంలో గ్రేటర్ ఆఫీసర్లు  ఓవైపు పనులుచేస్తుంటే మరో వైపు లీకేజీలు ఏర్పడుతున్నాయి. 

లీకేజీలు కామన్​ అయినయ్​

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు, మ్యాన్ హోల్  వద్ద లీకేజీలు కామన్​ అయ్యాయి. ముఖ్యంగా కోమటిబండ నుంచి వచ్చే మెయిన్​ పైపులైన్​ తరచూ పగిలి, రెండు మూడు రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోతున్నది. దీంతో మున్సిపల్ అధికారులు మిషన్​ భగీరథపై ఆధారపడవద్దనే నిర్ణయానికి వచ్చారు. పాత బోర్లకు రిపేర్లు చేసి టౌన్​, మండలంలో తాగునీటి సరఫరా చేస్తున్నారు.