మంచిర్యాల జిల్లాలో నీటి కటకట

మంచిర్యాల జిల్లాలో నీటి కటకట

మంచిర్యాల జిల్లాలో మిషన్​ భగీరథ స్కీం అస్తవ్యస్తంగా మారింది. జూలైలో వచ్చిన భారీ వర్షాలు, వరదలకు బల్క్​వాటర్​సప్లై చేసే పైపు లైన్లు పలుచోట్ల కొట్టుకుపోయాయి. రెండు నెలలు కావస్తున్నా నేటికీ రిపేర్లు పూర్తి కాలేదు. దీంతో కోటపల్లి, జన్నారం మండలాలకు భగీరథ నీళ్లు బంద్​అయ్యాయి. జిల్లాలోని మరో సగం గ్రామాలు, మున్సిపాలిటీలకు సైతం మురికి నీళ్లే దిక్కయ్యాయి. అసలే వర్షాకాలం కావడంతో కలుషిత నీటితో ప్రజలు జ్వరాలు, రోగాల బారిన పడుతున్నారు. 

మంచిర్యాల/చెన్నూర్/జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మూడు ప్రాంతాల నుంచి భగీరథ వాటర్​సప్లై జరుగుతోంది. మంచిర్యాల, చెన్నూర్​ నియోజకవర్గాలకు హాజీపూర్​మండలం గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రిడ్​నుంచి ఇస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టు గ్రిడ్ నుంచి, జన్నారం మండలానికి కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తున్నారు. జూలై 6 నుంచి 16 వరకు భారీ వర్షాలు, వరదలు జిల్లాను అతలాకుతలం చేశాయి. కడెం ప్రాజెక్టు గ్రిడ్​నుంచి జన్నారం మండలానికి బల్క్​ వాటర్​సప్లై చేసే మెయిన్​పైపు లైన్​ కడెం మండలం పాండ్వాపూర్ వాగులో కొట్టుకుపోయింది. ఇంధన్​పల్లి, జన్నారం మధ్య ఫారెస్ట్​లోని వాగుల నుంచి నిర్మించిన పైపులు సైతం దెబ్బతిన్నాయి. అలాగే చెన్నూర్​ శివారులోని బతుకమ్మ వాగులో వేసిన మెయిన్​ పైపు లైన్​ కూడా వరద తాకిడికి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కోటపల్లి మండలంలోని 31 గ్రామాలకు, జన్నారం మండలంలోని 20 గ్రామాలకు రెండు నెలలుగా భగీరథ వాటర్​సప్లై నిలిచిపోయింది.

ఇంజనీరింగ్​లోపం వల్లేనా?
కోటపల్లి మండలానికి వెళ్లే మెయిన్​పైపు లైన్​ను బతుకమ్మ వాగు అడుగు భాగం నుంచి వేశారు. ఇసుకలో కొంత లోతున సిమెంట్, కాంక్రీట్​నిర్మాణం చేపట్టి పైపులు వేశారు. భారీ వరదలు వచ్చినప్పుడు ఇసుక కోతకు గురై పైపులు దెబ్బతింటాయనే విషయాన్ని అధికారులు విస్మరించారనే ఆరోపణలు వస్తున్నాయి. వాగు అడుగు నుంచి కాకుండా బ్రిడ్జి లెవల్​లో పిల్లర్లు నిర్మించి పైపు లైన్​ వేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. దేవులవాడ గోదావరి నుంచి జైపూర్​లోని సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్​కు వాటర్​సప్లై చేసే పైపు లైన్​ను ఉపరితలం నుంచి వేశారు. ఇప్పుడు ఇదే రీతిలో భగీరథ పైపు లైన్​నిర్మిస్తామని గ్రిడ్​ అధికారులు పేర్కొంటున్నారు. తాత్కాలిక రిపేర్లు చేస్తున్నప్పటికీ తరచూ వరదలు రావడంతో పైపులు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. అటు పాండ్వాపూర్​దగ్గర కడెం వాగు మీదుగా మళ్లీ పైపు లైన్​ నిర్మించడానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు. కొన్ని కిలోమీటర్ల పొడవునా పైపులో పేరుకుపోయిన బురదను ఎలా క్లీన్​చేయాలా అని తలపట్టుకుంటున్నారు. ఈ రిపేర్లు పూర్తి కావడానికి మరో నెల రోజులకు పైగా టైమ్​ పడుతుందని సమాచారం.

సగం గ్రామాలు, మున్సిపాలిటీల్లో కటకట
మంచిర్యాల నుంచి వాంకిడి వరకు నేషనల్​ హైవే 363 నిర్మాణ పనులు రెండేండ్ల నుంచి కొనసాగుతున్నాయి. దీంతో అడ ప్రాజెక్టు గ్రిడ్​నుంచి బెల్లంపల్లి నియోజకవర్గానికి వాటర్ సప్లై చేసే పైపు లైన్​ తొలగించి మళ్లీ వేస్తున్నారు. ఈ కారణంగా వారం పది రోజులకు ఒకసారి బెల్లంపల్లి నియోజకవర్గానికి నీటి సరఫరా నిలిపేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని దాదాపు సగం ఊర్లకు నేటికీ భగీరథ నీళ్లు రెగ్యులర్​గా అందడం లేదు. రోడ్లు, డ్రైనేజీల పనులు, లీకేజీలు, పైపులు పగిలిపోవడం వంటి కారణాలతో ప్రజలు మంచినీటికి నోచుకోలేకపోతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్​మున్సిపాలిటీల్లో బల్క్​, ఇంట్రా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లి నియోజకవర్గానికి పది రోజులుగా వాటర్​ సప్లై బ్రేక్​చేసి ఆదివారం పునరుద్ధరించారు. భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల చాలాచోట్ల ప్రజలు పంచాయతీ బోర్లపైనే ఆధారపడుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో కలుషిత నీళ్లు తాగి రోగాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోరు నీళ్లే తాగుతున్నం
సీఎం కేసీఆర్​ సార్​ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని బజారుకు పోవుడు ఉండదంటే సంబురపడ్డం. మా ఊళ్లో రెండు ట్యాంకులు కట్టిన్రు. పైపు లైన్లు వేసిన్రు. కానీ ఇప్పటిదాకా గోదారి నీళ్లు రాలే. మా ఊరు ప్రాణహిత ఒడ్డుకే ఉంటది. ఆ నీళ్లు ఇచ్చినా బాగుండు. ఎప్పటితీరే పంచాయతీ పాత బోర్లకు మోటర్లు పెట్టుకొని నీళ్లు వాడుకుంటున్నాం. 
– రజిత, అన్నారం, కోటపల్లి మండలం 

రోగాలు వస్తున్నయ్
మా ఊళ్లో మూడు నీళ్ల ట్యాంకులు కట్టిన్రు. కానీ భగీరథ నీళ్లు మా ఇండ్లల్లకు వస్తలేవ్. మా వాడలో ఉన్న బోరింగ్​ కొట్టుకొని నీళ్లు తెచ్చుకుంటున్నం. బాగా మురికిగా ఉంటున్నయ్. ఊళ్లో అందరికి జెరాలు.. కక్కుడు, పారుడు అయితుంది. మా ఇంట్ల మామ, అత్త, భర్తకు టైఫాయిడ్​ వచ్చింది. ఈ నీళ్లు తాగలేకపోతున్నం. మంచినీళ్లు ఎప్పుడిస్తరో చెప్పాలె. – సరిత, దేవులవాడ, కోటపల్లి మండలం

ఆ నీళ్లతోటి దురద లేస్తోంది
మా ఊరికి మిషన్​ భగీరథ నీళ్లు రెండు నెలల సంది బంద్​ అయినయి. మొన్నటి వానలకు పాండ్వాపూర్​ దగ్గర పైపులు కొట్టుకపోయినట. అంతకు ముందు కూడా మురికి నీళ్లు వచ్చేది. తానాలకు, బట్టలకు వాడినా దురద లేస్తోంది. తొందరగా పైపులు రిపేర్లు చేపియ్యాలె. మురికి నీళ్లు రాకుండా సూడాలె.
– బుచ్చన్న, పొనకల్, జన్నారం మండలం