బ్రిడ్జి, రోడ్డు వెడల్పు తగ్గించాల్సిందే

బ్రిడ్జి, రోడ్డు వెడల్పు తగ్గించాల్సిందే

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామం మీదుగా నిర్మిస్తున్న ఫోర్ లైన్  రోడ్డు నిర్మాణ పనులతో పాటు, రైల్వే లైన్  కోసం నిర్మిస్తున్న బ్రిడ్జి పొడవును తగ్గించి పాత లెక్కల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని డిమాండ్  చేస్తూ గురువారం మిట్టపల్లి గ్రామ భూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ధర్నా సుమారు గంట సేపు కొనసాగింది.

 విద్యార్థులు కాలేజీలకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్  స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. బాధితులు మాట్లాడుతూ గతంలో రోడ్డు నిర్మాణం కోసం 100 ఫీట్ల మార్కింగ్  చేసినప్పుడే తాము స్థలం నష్టపోయామని, అయినా అందరి మంచి కోసం ఒప్పుకున్నామని తెలిపారు. 

ప్రభుత్వం ఇచ్చిన మార్కు ప్రకారమే ఇండ్లు, షాపులు నిర్మించుకున్నామని, ఓపెన్ ప్లాట్స్  కూడా కొనుక్కున్నామని చెప్పారు. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ వచ్చి పాత మార్కు నుంచి 25 ఫీట్లు పెంచి మార్కు చేయడంతో తాము నిర్మించుకున్న ఇండ్లతో పాటు ఖాళీ స్థలాన్ని కూడా పూర్తిస్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి పొడవు పెంచడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అవసరమైన మేరకు మాత్రమే బ్రిడ్జిని నిర్మించి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.