క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ: రేప‌టి నుంచి మ‌ళ్లీ పూర్తి లాక్ డౌన్

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ: రేప‌టి నుంచి మ‌ళ్లీ పూర్తి లాక్ డౌన్
  • క్వారంటైన్ 14 నుంచి 21 రోజుల‌కు పెంపు: మిజోరం సీఎం

కొద్ది రోజుల‌గా క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ కావ‌డంతో మిజోరం రాష్ట్ర స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి (జూన్ 9) నుంచి మ‌ళ్లీ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను మ‌రో రెండు వారాల పాటు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు ఆ రాష్ట్ర సీఎం జొరాంతంగ‌. కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించిన త‌ర్వాత అనేక రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. మిజోరంలో తొలుత ఒక‌టీ రెండు కేసులు మాత్ర‌మే న‌మోద‌వుతుండ‌గా.. ఇటీవ‌ల ప‌దుల సంఖ్య‌లో కేసులు వ‌స్తుండ‌డంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. టాస్క్ ఫోర్స్, ఎన్జీవోలు, ఎమ్మెల్యేలు, ప్ర‌భుత్వ అధికారులు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల వైద్య బృందాలు, చ‌ర్చి పెద్ద‌లు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులతో సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం దేశంలో, రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా లాక్ డౌన్ ను మ‌రో రెండు వారాల పాటు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు సీఎం. దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రేపు ఉద‌యం విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. అలాగే ప్ర‌స్తుతం 14 రోజుల‌గా ఉన్న‌ క్వారంటైన్ పీరియ‌డ్ ను త‌క్ష‌ణం 21 రోజుల‌కు పెంచాల‌ని ఆయ‌న ఆదేశించారు. క‌రోనా పేషెంట్ల‌ను త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేయాల‌ని, లేదంటే ఆస్ప‌త్రుల్లోనే వైద్యం అందించేందుకు మొగ్గు చూపాల‌ని సూచించారు.