
నేరడిగొండ, వెలుగు : ఆదివాసీలందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. మంగళవారం నేరడిగొండ మండలం చించోలి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 35 మంది ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.
అనంతరం దీపావళి పండుగను పురస్కరించుకొని మండలంలోని రాజురా గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు తన సొంత డబ్బులతో దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని వాంకిడి గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 173 మంది రైతులకు సబ్సిడీ శనగ విత్తనాల అందజేశారు. రైతులు సబ్సిడీ శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో శేఖర్, ఏవో కృష్ణవేణి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ఆఫీసర్లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.