
- మంత్రి సీతక్కను కోరిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి రూ. 44.10 కోట్ల నిధులను మంజూరు చేయాలని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి కోరినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల మండలం లింగంపేట నుంచి నల్లకుంట తండాకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి నుంచి లింగంధన వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, నెక్కొండ నుంచి బైరంపల్లి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, కొండేడు నుంచి తుపడగడ్డ తండా మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 4.50 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
బాలానగర్ మండలంలో జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతీ ఘనపూర్, సూరారం మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్లు, శేరిగూడ నుంచి బోడ జానంపేట్ కు వెళ్లే రోడ్డులో వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు చేయాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.