నిందలు  భరించలేకపోతున్నా.. రాజకీయాలనుంచి తప్పుకుంటా

నిందలు  భరించలేకపోతున్నా..  రాజకీయాలనుంచి తప్పుకుంటా

వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో కొందరిపై పరోక్ష విమర్శలు చేశారు. ఓదశలో తీవ్ర భావోద్వేగానికి గురైనా విషయం తెలిసిందే.. తనపై నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నానని కంటతడి పెట్టారు. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని వాపోయారు. గోనె ప్రకాశ్‌రావుకి, వైవీ సుబ్బారెడ్డి దేవుడిగా కనిపిస్తే అభ్యంతరం లేదు.. కాని తన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటని బాలినేని ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారాలు కూడా చేస్తున్నారని.. ఇవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని విమర్శించారు.

బాలినేని ఆవేదన 

బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకాశంలో వైసీపీ ముఖ్య నేతగా ఉన్నారు. జగన్ కోసం మంత్రిపదవిని వదిలేసి కలిసి అడుగులు వేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించారు. అదే సమయంలో అదే జిల్లాకు చెందిన సురేష్ను కేబినెట్​లో కొనసాగించటంపై బాలినేని మనస్థాపానికి గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్తో భేటీ తరువాత తిరిగి యాక్టివ్ అయ్యారు. కొంత కాలంగా జిల్లాలోనూ తన పైన పార్టీలో కొందరు వ్యతిరేకంగా పని చేస్తున్నారని బాలినేని వాపోయారు.

కీలక నిర్ణయాల దిశగా 

ప్రకాశంజిల్లాలో ఇద్దరు నేతలు కావాల్సిన వారే అయినా.. పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తే మాత్రం సహించే ధోరణిలో సీఎం లేరని సీనియర్లు చెబుతున్నారు. ఐప్యాక్‌ నుంచి ప్రత్యేక టీంలను జిల్లాకు పంపి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే బాలిలేని..ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్న మరో ముఖ్య నేతకు ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బలంగా ఉన్న జిల్లాల్లో సొంత పార్టీ నేతలే సమస్యలను తీసుకొస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి పైన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.