
మిర్యాలగూడ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం యూరియా విషయంలో చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి రైతుకు అవసరమైన యూరియాను అందించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం అగ్రికల్చర్ ఆఫీసర్లు, పీఏసీ ఎస్ సీఈవో లతో స్థానికంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత రైతులకు కేటాయిస్తున్న యూరియా బ్లాక్ మార్కెట్ కు, దళారులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు ఎవరు ఆందోళన పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఎకరాకు యూరియా అందిస్తుందని చెప్పారు. ఆఫీసర్లు రైతులకు సహకరించాలని కోరారు. మిర్యాలగూడ పరిధిలో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంకులు, ఎస్ టీపీ ప్లాంట్ పనుల పురోగతితో పాటు టీయూఎఫ్ ఐడీసీ వర్క్స్, మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్, గల్ఫర్ యంత్రం కొనుగోలు ఇతర అంశాలపై స్థానికంగా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాస్ ఉన్నారు.