నిధుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ

  నిధుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ

నిజామాబాద్ అర్బన్​, వెలుగు: నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని తెలిపారు. తమ సమస్యలు చెప్పుకుందామంటే సీఎం రేవంత్​రెడ్డి అపాయింట్​మెంట్​దొరకడం లేదన్నారు. 

జిల్లాల్లోని లీడర్లు ప్రతి పనిలో కమీషన్లు దండుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్​ నగరంలోని సమస్యలపై శుక్రవారం జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. నిజామాబాద్​లోని బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస వసతులు కరువయ్యాయని చెప్పారు. నగర శివారులో ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం, రింగ్​రోడ్డు పనులు అర్థంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. 

నగరాభివృద్ధి కోసం ప్రభుత్వానికి రూ.99 కోట్లతో ప్రణాళికలు పంపించామని, వీటిపై స్పందన రాకపోతే పోరుబాట పడుతామని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు న్యాలంరాజు, ఆనంద్​రావు, నాగరాజు, వేణు, మాస్టర్​శంకర్, సాయి, రఘు తదితరులు పాల్గొన్నారు.