
కామారెడ్డి, వెలుగు: దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డి, ఎల్లారెడ్డిలో జరిగిన నియోజకవర్గాల బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలని, వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బంతిని నేలకేసి కొడితే ఎంత వేగంగా పైకి వస్తుందో బీఆర్‌ఎస్ పార్టీ కూడా అంతే వేగంగా పైకి వస్తుందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గ్రహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని జైల్లో వేద్దాం.. ఎవరిపై బురద చల్లుదాం.. ఎవరి ముఖాన మసి రాద్దామా అని చూస్తోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టడంపైనే ఆ పార్టీ దృష్టి ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.