అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌కు కళ్లు నెత్తికెక్కాయి: హరీష్ రావు

అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌కు కళ్లు నెత్తికెక్కాయి: హరీష్ రావు

మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారని... వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించలేదని చెప్పారు. ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదని... కరెంటు, నీళ్లు లేవని.. కన్నీళ్లే మిగిలాయని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌కు కళ్లు నెత్తికెక్కాయని.. రైతుబంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టమంటాడా.. మీతో చెప్పుతో కొట్టించుకోవడానికేనా మిమ్మల్ని గెలిపించింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదని.. కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చిందన్నారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

  
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని.. మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదని విమర్శించారు. రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుందని.. రైతులు ధైర్యంగా ఉండాలన్నారు హరీష్ రావు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. మీకు అండగా మేముంటామని హామీ ఇచ్చారు. 

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలని.. చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ నాయకుల రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలన్నారు. మమ్మల్ని తిట్టండం ఆపి.. రైతులను ఆదుకోవాలని చెప్పారు. ముందు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు 15 వేలు, వడ్ల, మక్కలకు 500 బోనస్, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతుల 15 వేలు ఇస్తామని చెప్పి.. హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. 

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని బీజేపీ కూడా మాట తప్పిందని..  కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనన్నారు హరీష్​ రావు. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి, బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలని.. వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు హరీష్ రావు.