
సిద్దిపేట రూరల్, వెలుగు: విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాదని దేశం, సమాజం పట్ల బాధ్యతను పెంచుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంఠ ఆలయం వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ కనభరిచిన స్టూడెంట్స్కు పురస్కారాలు అందజేశారు. నారాయణరావు పేట మండలం కోదండరావుపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయంలో, ఇబ్రహీంపూర్ గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలతో ఎండాకాలం కూడా చెరువుల్లో జలకళ ఉందన్నారు. ఆలయానికి రూ. 50 వేలు విరాళంగా ఇచ్చారు. అంతకుముందు సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం విఠలాపూర్, రూరల్ మండలం ఇరుకోడు, అర్బన్ మండలం పొన్నాల గ్రామాల్లో జరిగే ఆలయాల ఉత్సవాలకు రావాల్సిందిగా పలువురు ఆయనకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. జులై 3 నుంచి అమరనాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు.