పాలమూరు జాతీయ హోదాపై ఎందుకు కొట్లాడం లేదు: హరీష్ రావు

పాలమూరు జాతీయ హోదాపై ఎందుకు కొట్లాడం లేదు: హరీష్ రావు
  • పాలమూరు జాతీయ హోదాపై ఎందుకు కొట్లాడం లేదు
  •  కేంద్ర మంత్రుల మెడలో కాంగ్రెస్​ లీడర్ల పూలదండలు
  • అలవికాని హామీలిచ్చి ఇపుడు చేతులెత్తస్తున్నరు
  • గజ్వేల్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీశ్​ రావు

గజ్వేల్: ‘‘ఈ దేశం ఆదానీ, అంబానీ చేతుల్లో ఉందని, ఆదానీ అవినీతి వెనుక ప్రధాని మోదీ ఉన్నడని, ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటడు. దావోస్​లో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, ఆదానీ కలిసి హగ్ ఇచ్చుకుంటరు.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటరు.. మరి ఆరోపణలు చేసిన రాహుల్ కరెక్టా, షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ కరెక్టా.” అని మాజీ మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు.  గజ్వేల్ లో జరిగిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. నాడు కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తే దండుగ అన్నరు, అక్కడికి వెళ్లడం వేస్ట్ అని ఉత్తకుమార్ రెడ్డి  అన్నరు, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దావోస్​వెళ్లినందుకు ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్​ నేతలను ఆయన నిలదీశారు. 

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటే బీజేపీపై కాంగ్రెస్ వాళ్లు ఎందుకు కొట్లాడం లేదన్నారు. బీజేపీ మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్ వాళ్లు, కేంద్ర మంత్రుల మెడలో నేడు పూలదండలు వేస్తున్నారని ఆరోపించారు.  ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు.  ఒక్కనాడు కూడా కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ వాళ్లు  బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హామీలను నెరవేర్చలేక  ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నరని విమర్శించారు. ప్రగతి భవన్ లో 250 బెడ్ రూంల ఆరోపణపై ఇప్పుడు అక్కడ ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టి  వాస్తవాలు చెప్పాలని కోరారు.  త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కు కేసీఆర్​ వస్తారన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్  నీళ్లను  విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.