టీఆర్ఎస్ ఏజెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

టీఆర్ఎస్ ఏజెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘నేను కొట్లాడుతుంటే కోవర్టు అంటరా? నేను కోవర్టు అయితే, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా భార్యను ఎందుకు పోటీ చేయిస్తాను” అని పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. పార్టీ నాయకత్వాన్ని లైన్‌‌లో పెట్టడానికే తాను మాట్లాడుతున్నానని, 5న నిర్వహించే పార్టీ సమావేశంలో అన్ని అంశాలు మాట్లాడుతానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పీసీసీ చీఫ్‌‌ సొంత జిల్లా మహబూబ్‌‌నగర్‌‌లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. క్యాండిడేట్‌‌ లేడు అంటే, వేరే పార్టీకి ఓటేసుకొమ్మని చెప్పడమే కదా? అని ప్రశ్నించారు. తాను, ఖమ్మం నాయకులు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కొన్నామన్నారు.  హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక దగ్గరికొచ్చినంక క్యాండిడేట్‌‌ ను ప్రకటించడం పార్టీ పద్ధతేనా అని నిలదీశారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌‌లో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘‘నాపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చిన్నారెడ్డి చేసిన ప్రకటన వెనుక రేవంత్‌‌ రెడ్డి హస్తం ఉంది. చిన్నారెడ్డి సోనియాగాంధీ డైరెక్షన్‌‌లో పని చేయట్లేదు” అని జగ్గారెడ్డి అన్నారు. చిట్‌‌చాట్‌‌లో శశిథరూర్‌‌పై ఎలా పడితే అలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్‌‌ అంటే బస్సుకు డ్రైవర్‌‌ లాంటోడేనని, బస్సు సక్కగలేదు సరిదిద్దుకొమ్మని చెప్పానన్నారు.

టీఆర్ఎస్ లోకి పోయేదుంటే డైరెక్టుగానే పోత
మంత్రి కేటీఆర్‌‌ సంగారెడ్డి పర్యటనకు వస్తే రూ.900 కోట్ల నిధులు అడిగానని జగ్గారెడ్డి చెప్పారు. ‘‘మంత్రి కేటీఆర్‌‌ను కలిస్తే కండువా కప్పుకున్నట్టు ప్రచారం చేస్తున్నరు. నేను టీఆర్‌‌ఎస్‌‌ ఎజెంట్‌‌ అని సోషల్‌‌ మీడియాలో రాస్తున్నారు” అని మండిపడ్డారు. టీఆర్‌‌ఎస్‌‌లోకి పోవాలనుకుంటే డైరెక్ట్‌‌గానే పోతానని స్పష్టం చేశారు.