రఘునాథపల్లి, వెలుగు: రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో జిల్లా, మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో రూ.2.90 కోట్లతో నిర్మించనున్న 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇక్కడి బీజేపీ నాయకులు బాధ్యతారహితంగా కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, డీఆర్డీఏ పీడీ నూరుద్దున్ తదితరులు పాల్గొన్నారు.
