వాస్తు దోషం పేరుతో కూల్చివేతలు..క్యాంపు ఆఫీస్​లో ఇంకా అడుగుపెట్టని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వాస్తు దోషం పేరుతో కూల్చివేతలు..క్యాంపు ఆఫీస్​లో ఇంకా అడుగుపెట్టని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ రూరల్, వెలుగు: వాస్తు దోషం పేరిట కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో మంగళవారం కూల్చివేత పనులు చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు అయినా.. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటి దాకా క్యాంప్ ఆఫీస్​లో అడుగుపెట్టలేదు. వాస్తు దోషం తొలగించుకున్నాకే ఆఫీస్​కు వెళ్లాలని పండితులు చెప్పడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో ఇదే క్యాంప్ ఆఫీసును వాస్తు దోషం పేరుతో కాంపౌండ్ వాల్​ను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూల్చి వేయించి గేటు పెట్టారు. 

వాస్తు దోషం ఉండటంతోనే ఈటల తిరిగి ఎమ్మెల్యేగా గెలవలేదని, ఆఫీస్​లో అడుగుపెడితే తనకూ దోషం పట్టుకుంటదని ఇటీవల గెలిచిన కౌశిక్ రెడ్డి గట్టిగా నమ్మినట్లు తెలుస్తున్నది. అందుకే వాస్తు పండితుల సూచన మేరకు మెయిన్ గేటుకు ఎదురుగా ఉండే గుమ్మటాన్ని తొలగించే పనిలో పడ్డారు. వాస్తు పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.