బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేస్తరు: రాజగోపాల్ రెడ్డి

బీఆర్​ఎస్​ను బీజేపీలో విలీనం చేస్తరు: రాజగోపాల్ రెడ్డి
  • కేటీఆర్​, హరీశ్, కవితను కేసీఆరే దగ్గరుండి పంపిస్తరు: రాజగోపాల్​ రెడ్డి
  • బీఆర్​ఎస్​కు బీజేపీనే శ్రీరామ రక్ష
  • నాకు హోంమంత్రి కావాలనుంది.. అయితే మాత్రం కేసీఆర్​ ఫ్యామిలీ జైలుకే
  • మా ఫ్యామిలీ నుంచి లోక్​సభకు పోటీ చేయాలని అనుకోవట్లే 
  • పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ బీఆర్​ఎస్​ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, కవితను కేసీఆరే దగ్గరుండి బీజేపీలోకి పంపుతారన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్​చాట్​ చేశారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పని అయిపోయిందని, ఆ పార్టీకి బీజేపీనే శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీకి మద్దతివ్వకుంటే కేసీఆర్​ ఫ్యామిలీ జైలుకు పోతుందన్నారు. ‘కేసీఆర్​ తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకే తన కుటుంబ సభ్యులను బీజేపీలో చేరమని పంపిస్తారు’ అని అన్నారు. అసెంబ్లీ సెషన్​ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. తనకు హోం మంత్రి కావాలని ఉందని,  తాను హోం మంత్రిని అయితే బీఆర్​ఎస్​ లీడర్లు కంట్రోల్​ ఉంటారని, వాళ్లను జైల్లో వేస్తానని పేర్కొన్నారు. 

కేసీఆర్​ను గద్దె దించేందుకే వచ్చా

కేసీఆర్​ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్​ పార్టీలోకి తిరిగొచ్చానని కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు. తాను బీజేపీలోనే ఉంటే ఎల్బీనగర్​ నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోయేవాడినా అని ప్రశ్నించారు. లేదంటే ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి పొందకపోయేవాడినా అని అన్నారు. పదవి తనకు బీజేపీలో ఉన్నా వచ్చేదన్నారు. కేసీఆర్​ను రాష్ట్రంలో గద్దె దించాలంటే కాంగ్రెస్​తోనే సాధ్యమన్న ఉద్దేశంతోనే పార్టీలో తిరిగి చేరానని తెలిపారు. కేసీఆర్​, బీఆర్​ఎస్​పై జనంలో కోపం ఉందని, నల్గొండలో కేసీఆర్​ సభ పెట్టినా ఒరిగేదేమీ ఉండదని అన్నారు. వారికి ఏమీ లేకనే కేఆర్​ఎంబీ పేరిట డ్రామా మొదలు పెట్టారన్నారు. తమ కుటుంబ సభ్యులు నల్గొండ, భువనగిరి లోక్​సభ స్థానాల్లో పోటీ చేయదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తామని తెలిపారు. తమను పోటీ చేయాలంటూ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, వేరే వారికి టికెట్​ఇచ్చినా మద్దతు ప్రకటిస్తామని చెప్పారు.  

లాబీలో కేటీఆర్, రాజగోపాల్ మధ్య ఆసక్తికర చర్చ

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందంటూ రాజగోపాల్​ రెడ్డిని కేటీఆర్​ ప్రశ్నించగా.. పదవిస్తే బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో మీకు పడిన ఫ్యామిలీ పాలిటిక్స్​ మచ్చే తమకూ పడుతుందని రాజగోపాల్​ రెడ్డి సమాధానమిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదని, మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్​ ప్రతి జవాబునిచ్చారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తున్నారా.. లేదంటే కుమారుడు సంకీర్త్​ పోటీ చేస్తారా అని కేటీఆర్​ ప్రశ్నించారు. అయితే, తనను కాంట్రవర్సీల్లోకి లాగొద్దంటూ కేటీఆర్​కు రాజగోపాల్​ రెడ్డి సమాధానం చెప్పారు.