భూభారతితో భూ సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భూభారతితో భూ సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ, వెలుగు : గత ప్రభుత్వంలో ధరణితో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం మండలం లోని జగన్నాథపురం పెద్దమ్మతల్లి శ్రీనివాస్ కల్యాణం మండపంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూములకు సంబంధించిన అన్ని అంశాలను భూభారతిలో పొందుపర్చినట్టు చెప్పారు. కలెక్టర్ జితేశ్​వి పాటిల్ మాట్లాడుతూ భూభారతిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, అధికారులు. జాప్రతినిధులు పా ల్గొన్నారు. 

సాదాబైనామా దరరఖస్తులూ పరిష్కారం.. 

 తల్లాడ : రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల పైన సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించడానికి భూభారతి చట్టం ద్వారా మార్గం దొరికిందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రగామయి అన్నారు. తల్లాడ ఆర్బీ గార్డెన్ లో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు భూభారతితో 90 శాతం తహసీల్దార్ వద్దే పరిష్కారమవుతాయని తెలిపారు. 

ధాన్యం కొనుగోలులో మిల్లర్ల సమస్య ఉందని, సమస్యలను కలెక్టర్ తో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర గౌడ్, తహసీల్దార్ సురేశ్ బాబు, ఎంపీడీఓ సురేశ్​కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దగ్గుల రఘుపతి రెడ్డి, రాయల రాము తదితరులు పాల్గొన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల రచ్చ 

తల్లాడలోని భూభారతి అవగాహన సదస్సులో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక కాని వారు గొడవకు దిగారు. సదస్సు ముగిసే సమయంలో అన్నారుగూడెం గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు తమకు అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయలేదని ఎమ్మెల్యే రాగమయి, అధికారులను ప్రశ్నించారు. గూడూరు (వెంగన్నపేట) గ్రామంలో అనర్హులను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేశారని ఎమ్మార్పీఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. 

మల్సూర్ తండా కు చెందిన కొంతమంది రైతులు నెలరోజులైనా ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యే సదస్సుకు వచ్చే సమయంలో ఆమె కారుకు ఎదురుగా నిలబడి ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అధికారులు, నాయకులు కల్పించుకొని వారిని సముదాయించారు.