తిరుమలగిరి సాగర్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా : ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి

తిరుమలగిరి సాగర్ ను అభివృద్ధిలో  అగ్రగామిగా నిలుపుతా : ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి

హాలియా, వెలుగు:  తిరుమలగిరి (సాగర్) మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలకు 4  ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరావు నుంచి ఆమోదం లభించిందన్నారు. 

మార్కెట్ యార్డులో తహసీల్దార్, మండల పరిషత్,  పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్ తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలను త్వరలోనే నిర్మించనున్నామని చెప్పారు. అల్వాల అడ్డరోడ్డు నుంచి డొక్కల బావి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరయిందని త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తిరుమలగిరి సాగర్ మండలంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద 3500 ఇండ్లు మంజూరన్నారు. 

మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ కాల్సాని చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, జిల్లా కార్యదర్శి గడ్డం సాగర్ రెడ్డి, మండల్ నాయకులు శాగం రాఘవరెడ్డి, కృష్ణ, బాలు, లాలు తదితరులు పాల్గొన్నారు.