కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టింది కేసీఆరే

కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టింది కేసీఆరే

పాలమూరు, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాలను మాజీ సీఎం కేసీఆర్​ ఏపీకి కట్టబెట్టారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించినట్లు తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్  కాదన్నారు.

కేసీఆర్ అసమర్ధత వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేలా ఒప్పందం చేసుకొని ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 27 ఎకరాలకు కూడా నీరు పారించలేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్  రంగంలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారనే విషయం ప్రజలకు కూడా తెలిసిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ గౌడ్, మీడియా సెల్  కన్వీనర్  సీజే బెనహర్, సాయిబాబా, రాములు యాదవ్  పాల్గొన్నారు.