ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎమ్మెల్యే మట్టా రాగమయి

ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎమ్మెల్యే మట్టా రాగమయి

ఖమ్మం టౌన్, వెలుగు :  ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరగా  పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్​రెడ్డి కమిటీ సభ్యులకు, పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. బాధితులకు పరిహార పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేపట్టామని చెప్పారు. సమావేశంలో చర్చించిన విషయాలపై చర్యల నివేదిక ఇవ్వాలన్నారు. 

అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి, పరిష్కరించాల్సిన సమస్యలను తదుపరి సమావేశంలో లిఖితపూర్వక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 735 నమోదు కాగా, 29 కేసులు ఎఫ్ఐఆర్, 101 కేసులు ఛార్జ్ షీట్, 562 కేసులు జడ్జిమెంట్, మిగతా కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయన్నారు. 713 కేసులకు పరిహారం మంజూరు అయిందని, ఇందులో 247 ఎస్టీ బాధితులు, 532 ఎస్సీ బాధితులు ఉన్నారని వివరించారు. 

ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నరేశ్​కుమార్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎన్. విజయలక్ష్మి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, ఆర్డీవోలు జి. నర్సింహారావు, ఎల్. రాజేందర్ గౌడ్, ఏసీపీలు ఎంఏ రహమాన్, ఏ.రఘు, తిరుపతి రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.