ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా  సంక్షిప్త వార్తలు

రోడ్డును రిపేర్​ చేయాలని ఎమ్మెల్యే ధర్నా

చేర్యాల, వెలుగు:  జనగామ– దుద్దేడ జాతీయ రహదారి రోడ్ ను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి , టీఆర్​ఎస్​ నాయకులతో కలిసి మండల కేంద్రంలో ని గాంధీ సెంటర్లో  శనివారం  రాస్తారోకో నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ – దుద్దేడ రోడ్డు పూర్తిగా దెబ్బ తినడం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. స్టేట్ రోడ్డుగా ఉన్నప్పుడు  మంచిగుండేదని,  ఆరేండ్ల   కిందట జాతీయ రహదారి గా మారిన తర్వాత ఈ రోడ్ ను కేంద్రం పట్టించు కోవడం లేదని ఆరోపించారు. ఏడాది కింద  టెండర్లు ఖరారు అయినప్పటికీ పనులు చేయడం లేదన్నారు. వెంటనే రోడ్డు రిపేర్ పనులు చేపట్టాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని  హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ లు కృష్ణారెడ్డి, కర్ణాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూపా రాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పి. ఎల్లారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. 

పేదలకు పెద్దన్న కేసీఆర్​

దుబ్బాక, వెలుగు : కొడుకులు, కోడళ్లు పట్టించుకోని తల్లిదండ్రులకు, అన్నదమ్ముళ్ల నిరాదారణకు గురైన ఒంటిరి మహిళలు, వితంతువులకు, వికలాంగులు, బీడీ కార్మికులకు సీఎం కేసీఆర్​పెద్దన్నగా, పెద్దకొడుకులా ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నారని మంత్రి హరీశ్​రావు అన్నారు. శనివారం దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండల కేంద్రాల్లో 57 ఏండ్లు నిండిన వారికి కొత్త ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే రఘుందన్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్​ హుస్సేన్, వంటేరు ప్రతాప్​రెడ్డి, జడ్పీ చైర్మన్​ రోజా శర్మ, కలెక్టర్ ​ప్రశాంత్​ జీవన్​పాటిల్​తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం చేపట్టే ఉచిత పథకాలను బంద్​ చేయాలంటున్న బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో బంద్​ చేయాలని అన్నారు.   దేశంలో ఎక్కడాలేని విధంగా ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకున్నవారికి కేసీఆర్​ కిట్టు, రాష్ట్రంలో 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. కాళేశ్వరంతో ప్రతి ఇంటికీ తాగు, సాగు నీరు అందించి నీటి గోసను తీర్చిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 

దుబ్బాకలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ల్లో బస్తీ దవాఖానాతో పాటు హైమాస్ట్​​ లైట్లు ఫిట్​ చేయడానికి రూ. 20 లక్షల విలువైన నిచ్చెన, జేసీబీ, డోజర్​, చెత్త సేకరణ కోసం నాలుగు ఆటోలను మున్సిపాల్టీకి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వంద పడకల ఆస్పత్రికి న్యూ బర్న్​ స్టెరిలైజేషన్​యూనిట్​ను అందజేస్తామని హామీ ఇచ్చారు. భూంపల్లి పీహెచ్​సీ రిపేర్లకు రూ. 1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దుబ్బాకలో ప్రెస్​ క్లబ్​ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, అర్హులైన జర్నలిస్ట్​లకు ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న 36 వేల మందికి పింఛన్లు ఇవ్వాలని, మీ సేవలో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకుని వెబ్​ సైట్​ను ఓపెన్​ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు మంత్రికి విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

అర్హులకే పెన్షన్లు ఇవ్వాలి


దుబ్బాక మండలంలో ధనవంతులకు, ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లో పింఛన్లు​ మంజూరు చేసుకోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో ప్ల కార్డులతో మంత్రి మీటింగ్​లో నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయగా, పోలీసులు  వారిని అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. అనర్హులకు ఆసరా పెన్షన్లు మంజూరు చేశారని మంత్రి దృష్టికి తీసుకెల్దామని పోతే అడ్డుకోవడం, అరెస్ట్​ చేయడం అప్రజాస్వామికమని నాయకులు మండిపడ్డారు.  అరెస్టు అయినవారిలో సీఐటీయూ, ఐద్వా నాయకులు గొడ్డుబర్ల భాస్కర్​, సింగిరెడ్డి నవీన ఉన్నారు. 

వీక్లీ పరేడ్ తో ఫిజికల్ ఫిట్​నెస్

సిద్దిపేట రూరల్, వెలుగు: వీక్లీ పరేడ్ వల్ల ఫిజికల్ ఫిట్​నెస్ తో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని సిద్దిపేటత సీపీ ఎన్.శ్వేత అన్నారు. శనివారం పెద్ద కోడూర్ గ్రామ శివారులోని ఏఆర్  హెడ్ క్వార్టర్స్​లో జిల్లాలోని సివిల్, ఏఆర్  పోలీస్, హోంగార్డ్ ల వీక్లీ పరేడ్ కు ఆమె హాజరై గౌరవ  వందనం స్వీకరించారు. ఆర్మ్స్, స్క్వాడ్, లాఠీ డ్రిల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ అధికారులు క్రమశిక్షణతో డ్యూటీ చేసి పోలీస్ శాఖకు మంచిపేరు తేవాలని సూచించారు. ధర్నాలు, రాస్తారోకోలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రైనింగ్​ ఇవ్వాలని ఏఆర్ అడిషనల్ డీసీపీలకు ఆమె సూచించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్  డీసీపీలు రాంచందర్​రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు దేవారెడ్డి, ఫణీందర్, ఆర్ఐ​ రాజశేఖర్ రెడ్డి, ధరణి కుమార్, రామకృష్ణ, సీఐలు భిక్షపతి, రవికుమార్, భాను ప్రకాశ్​, జానకీ రాంరెడ్డి పాల్గొన్నారు.

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి

వినయక చవితి వేడుకల సందర్భంగా మండపాల యజమానులు పోలీసుల అనుమతి తీసుకోవాలని  సీపీ సూచించారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండే ప్రాంతాల్లో మాత్రమే మండపాల ఏర్పాటుకు అనుమతి ఇస్తామని చెప్పారు. 

ఆకుకూరల జాతర
ఆహారం.. ఆరోగ్యం పేరుతో ఫీల్డ్ విజిట్ 
డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ  ఆధ్వర్యంలో 53 రకాల ఆకుకూరల ఎగ్జిబిషన్

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు :  సహజసిద్ధమైన ఆకుకూరలు.. ఆహారం.. ఆరోగ్యం అనే లక్ష్యంతో డెక్కన్ డెవలప్​మెంట్​ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఆకుకూరల జాతర అందరిని ఆకట్టుకుంది. ఇందులో 53 రకాల ఆకుకూరలను ప్రదర్శించగా ఆరోగ్యకరమైన ఆకు కూరలను వండి అతిథులకు వడ్డించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మాచునూర్ పచ్చటి పొలాల మధ్య డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఆకుకూరల జాతర కొనసాగింది. దాదాపు 53 రకాల సాగు చేయని పోషక విలువలు కలిగిన ఆకుకూరలను ప్రదర్శించారు. ‘మన ఆకుకూరలను కాపాడుకుందాం..ఆరోగ్యంగా ఉందాం’ అంటూ సాగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన పలువురు ఆరోగ్య నిపుణులు, ఫార్మా, ఐటీ కంపెనీల ఉద్యోగులు, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ పాల్గొని ఫీల్డ్ విజిట్ చేశారు. ముందుగా ఝరాసంగం మండలం పొట్టిపల్లి, న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామాల పరిధిలో ప్రకృతి సహజంగా మొలిచే అరుదైన పోషకాలు కలిగిన ఆకుకూరలను సందర్శించారు. పొలాల మధ్య పెరిగే ఆకుకూరలను పరిశీలించి అందులో ఉండే పోషకాలు, వాటి సహజ గుణాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ విజిట్, సాంప్రదాయ ఆకుకూరల భోజనం తర్వాత డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ మహిళా రైతుల సమక్షంలో మాచునూర్ శివారులో ఏర్పాటు చేసిన చర్చ గోష్ఠిలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

పేదలందరికీ వైద్యం  అందించడమే లక్ష్యం

నారాయణ్ ఖేడ్, వెలుగు: పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణంలో ఇప్పటికే వంద పడకల  ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే 50 పడకల మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గవర్నమెంట్​హాస్పిటళ్లలో కార్పొరేట్  స్థాయి వైద్యం అందుతుందని అన్నారు. 

పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి నారాయణఖేడ్ మండలం కొండాపూర్  హనుమాన్  ఆలయం వరకు 25 కిలోమీటర్ల హనుమాన్​ భక్తుల పాదయాత్రను హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యుడు కిషోర్  ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెరగాలని అన్నారు.         

మల్లన్న సాగర్​ను  సందర్శించిన కలెక్టర్


దుబ్బాక, వెలుగు: మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ను శనివారం కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్ ​పాటిల్ ​సందర్శించారు. మల్లన్న సాగర్​ సొరంగ మార్గం, పంప్ హౌజ్​, నీటిని ఎత్తిపోసే ప్రాంతాన్ని పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నుంచి మల్లన్న సాగర్​ వరకు వచ్చే సొరంగ మార్గాన్ని పంప్​ హౌజ్​ విధానం, కాళేశ్వరం, మల్లన్న సాగర్​ ప్రత్యేకలు, నీటిని ఎత్తిపోసే విధానంపై ఇరిగేషన్​ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్​ వెంట అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో అనంత రెడ్డి, ఇరిగేషన్​ అధికారులు ఉన్నారు.

30 టన్నుల రేషన్  బియ్యం పట్టివేత


నర్సాపూర్, వెలుగు : మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలం కాగాజ్ మద్దూర్ శివారులోని ఓ రైస్ మిల్లుపై శనివారం పక్కా సమాచారంతో దాడి చేసి 30 టన్నుల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నట్టు విజిలెన్స్ ఆఫీసర్లు తెలిపారు. ఈ బియ్యాన్ని ఎఫ్ సీఐ గోడౌన్​కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో విజిలెన్స్ ఎన్​ ఫోర్స్​ ​మెంట్, టాస్క్​ఫోర్స్​ అడిషనల్ డీఎస్పీ ద్రోణాచారి, ఎస్సైలు వెంకటేశ్వర్లు సాంబశివరావు పాల్గొన్నారు.