పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

నిజాంపేట, వెలుగు: బీఆర్ఎస్ గవర్నమెంట్ గడిచిన పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆరోపించారు. గురువారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ తో కలసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 

ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం, మహిళ సంక్షేమం మీద దృష్టి పెట్టిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ లు, దళిత బంధు, బీసీ బంధు అని  మాయమాటలు చెప్పి మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ ఎస్ నాయకులు ఎలక్షన్ లు రాగానే మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుని కనపడకుండా పోయే వారని తెలిపారు. 

ప్రీ ప్రైమరీ స్కూళ్ల వల్ల అంగన్వాడీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని అందుకే ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఎంపికను నిలిపివేయాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎమ్మెల్యే కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, డీటీ రమ్య శ్రీ, ఆర్ఐలు ప్రీతి, ఈమాద్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 

పెళ్లయి కుటుంబాలు వేరైనా రేషన్ కార్డు ఇవ్వలేదు 

చిన్నశంకరంపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండ్లయి కుటుంబాలు వేరైనా సభ్యులు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి  చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని  రైతు వేదికలో లబ్ధిదారులకు  రేషన్ కార్డుల పంపిణీ చేశారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ  కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యని చరిత్ర గత  ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో 846 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేశామని, 1, 857కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామన్నారు.