మెదక్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బుధవారం 34 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని విధాల అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేశ్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణ శివారులో కెమిస్ట్అండ్ డ్రగ్గిస్ట్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
రామాయంపేట అభివృద్ధికి కృషి
రామాయంపేట: రామాయంపేట పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. బుధవారం ఆయన మెదక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు. మున్సిపల్ లో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు. క్రీడలు, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, రమేశ్ రెడ్డి, నాగరాజు, యాదగిరి పాల్గొన్నారు.
