ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పర్వతగిరి(సంగెం) : వరంగల్ టెక్స్ టైల్ పార్కులోని కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. వాటర్ వర్క్స్, 220 కేవీ సబ్ స్టేషన్ పనుల్ని తనిఖీ చేశారు. భూనిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2023 ఫిబ్రవరిలోగా కైటెక్స్ కంపెనీ నిర్మాణం పూర్తవుతుందన్నారు. త్వరలోనే యంగ్ వన్ కంపెనీ నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. ఆయా కంపెనీలతో వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు.

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి

వరంగల్ సిటీ : కుష్ఠు వ్యాధి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని మెడికల్ అడిషనల్ డైరెక్టర్ డా.రవీంద్ర నాయక్​సూచించారు. మంగళవారం సిటీలోని డీఎంహెచ్​వో ఆఫీసులో కుష్ఠు వ్యాధి నిర్మూలపై రివ్యూ నిర్వహించారు. వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చెక్ చేయించుకుని, ట్రీట్ మెంట్ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ తదితరులున్నారు.

తొలిమెట్టు’ను సక్సెస్ చేయాలి

మహబూబాబాద్ : ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో రాణించేలా ప్రభుత్వం రూపొందించిన ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని టీచర్లు సక్సెస్ చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లలకు ల్యాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ నేర్పించాలన్నారు. ప్రతి నెలా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పాలన్నారు. మెరిట్ స్టూడెంట్లు, వెనుకబడిన విద్యార్థులకు పాఠాలు చెప్పే విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. ప్రతీ ప్రైమరీ స్కూల్​లో ఒకే రకమైన టైం లైన్ క్యాలెండర్ ఉండాలన్నారు. ప్రతి నెలా మండల స్థాయిలో సబ్జెక్టుల వారీగా టీచర్లకు వర్క్ షాప్స్ నిర్వహించాలన్నారు. డీఈవో అబ్దుల్ హై, మండల నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 

భార్యతో గొడవపడి భర్త సూసైడ్

జనగామ అర్బన్ : భార్యతో గొడవపడి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ మండలం ఓబుల్ కేశవాపూర్​లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రమోద్​కుమార్, తన భార్య జయశ్రీ, అత్తామామలతో ఓబుల్ కేశవాపూర్ గ్రామానికి వలస వచ్చాడు. స్థానికంగా ఉండే ఓ రైస్ మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య జయశ్రీ మరొకరితో ఫోన్​లో మాట్లాడుతుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. సోమవారం రాత్రి భార్యతో గొడవ పడి మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం కుటుంబసభ్యులు చూసి కన్నీరుమున్నీరయ్యాడు.

చిట్టీల భారంతో..

పర్వతగిరి(సంగెం): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్​జిల్లా సంగెం మండలం కృష్ణానగర్​లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెవ్వ రవి(42) హమాలీ పనిచేసేవాడు. కొద్దిరోజుల కింద చిట్టీలు వేసి కూతురు పెండ్లి చేశాడు. నెల రోజుల నుంచి పని దొరక్కపోవడంతో చిట్టీలు ఎలా కట్టాలని బాధపడ్డాడు. ఈక్రమంలో సోమవారం పాయిజన్ తాగాడు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.


ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి చేస్తారా?

ములుగు : ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి చేసే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ లీడర్లు పాలనను విస్మరించి, సొంత ప్రయోజనాల కోసం పనిచేయడం సిగ్గుచేటన్నారు. మంగళవారం బీజేపీ మండలాధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు ఆధ్వర్యంలో బంజరుపల్లి గ్రామానికి చెందిన 50మంది యువకులు బీజేపీలో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భాస్కర్​ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రజా సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున యువత బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. వెనుకబడిన ములుగు జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వానికి గానీ ఎమ్మెల్యే సీతక్కకు గానీ చిత్తశుద్ధి లేదన్నారు. అభివృద్ధి చేయడం చేతకాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని హితవు పలికారు. అలా అయినా ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి డి.వాసుదేవరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ బలరాం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, వెంకటాపూర్​మండలాధ్యక్షుడు భూక్య జవహర్​లాల్ తదితరులున్నారు.

వామ్మో.. మస్తు చలి

మహాముత్తారం : రెండ్రోజులుగా ఉమ్మడి జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. దీపావళి ముందు ఒక మాదిరిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 6 నుంచి ఉదయం 7 గంటల వరకు చల్లని ఈదురు గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రతకు పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లోని రైతులు, కార్మికులు చలి మంటలు 
వేసుకుంటున్నారు. 

నేటి నుంచి నేతకాని బతుకమ్మ వేడుకలు

హసన్ పర్తి : హనుమకొండ జిల్లా హసన్  పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఏటా దీపావళి తర్వాత బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఆడ, మగ అనే తేడా లేకుండా బతుకమ్మ ఆడడం విశేషం. ఈ ఏడాది కూడా వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. నేడు చెరువు మట్టితో దేవతల ప్రతిమలను(ఎద్దులను) తయారు చేసి, నైవేద్యం సమర్పించనున్నారు. ఎల్లుండి ఆ ప్రతిమలను కోలాటాలు ఆడుతూ.. చెరువులో నిమజ్జనం చేస్తారు. మరుసటి రోజు గౌరమ్మను తయారు చేసి, బతుకమ్మ పేర్చి, ఆడిపాడతారు.

ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి

వరంగల్ సిటీ: చేనేత రంగాన్ని అవమానించేలా వ్యవహరించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నేతన్నలు డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ లోని గోపాలస్వామి గుడి ప్రాంతంలో చేనేత కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నరేందర్ చేనేత పరికరాలు, మగ్గంపై కాళ్లు వేసి అవమానించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చేనేత కార్మికులకు నచ్చజెప్పారు.

రక్తదానం చేయాలి

బచ్చన్నపేట : అర్హులందరికీ రక్తదానం చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్ సర్పంచ్ కోనేటి స్వామి తెలిపారు. మంగళవారం వరంగల్​లో ఎంజీఎంలో ప్రాణాప్రాయ స్థితిలో ఓ గర్భిణికి సర్పంచ్ బ్లడ్ డొనేట్ చేశారు. రక్త దానంపై అపోహలు వీడాలని, ఆరోగ్యంగా ఉండి 18 ఏండ్లు దాటిన వారు బ్లడ్ డొనేట్ చేయవచ్చన్నారు.

బాడీ ఫీజర్ వితరణ

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామానికి  స్నేహ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస్ బాడీ ఫీజర్​ను అందజేశారు. సర్పంచ్ మాట్ల రవీందర్ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో ఈ యంత్రాన్ని పంపిణీ చేశారు. స్నేహ ఫౌండేషన్ సేవలను ప్రజాప్రతినిధులు కొనియాడారు. అనంతరం శ్మశానవాటికకు భూమి ఇచ్చిన దొంతుల నాగేశ్వర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దబ్బెట అశోక్, ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తూరి ఇంద్రసేనా, ఉపాధ్యక్షులు జనగాని సాంబయ్య తదితరులున్నారు.

పట్టపగలే అడవిలో చెట్ల నరికివేత

మహాముత్తారం : పట్టపగలే రిజర్వ్ ఫారెస్ట్ లో కొందరు వ్యక్తులు చొరబడి ఇష్టానుసారంగా మెషిన్లతో చెట్లు నరికేశారు. ఈ  సంఘటన జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహాముత్తారం నార్త్​బీట్​లో జరిగింది. ఏండ్ల కాలం నాటి చెట్లు నేలకూలాయి. గతంలో చిన్న చిన్న పొదలను ఆజంనగర్​కు చెందిన వ్యక్తులు నరికేయగా.. అప్పట్లో వారిపై ఫారెస్ట్​ ఆఫీసర్లు కేసు ఫైల్​ చేశారు. ఇప్పుడు అదే స్పాట్​లో గుర్తు తెలియని వ్యక్తులు మెసిన్లతో అడవిని నరికేశారు. ఈ విషయంపై ఆజంనగర్ ఇన్ చార్జి రేంజ్​ఆఫీసర్ ఆసిఫ్ ను వివరణ కోరగా.. చెట్లు నరికి వేసిన ఆజంనగర్, మహాముత్తారం, యామన్​పల్లి గ్రామాల​కు చెందిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే చెట్ల నరికివేతకు పోడు పట్టాలే కారణంగా తెలుస్తోంది. చెట్లు నరికివేసిన జాగ విషయంలో పోడు రైతులకు, ఆఫీసర్లకు మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది.