చేర్యాల, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని, ఆ వర్గం కోసం గత ప్రభుత్వంలో ఎంతో చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాములలో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత పేదలు దళితులేనని, వారి అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని కొనియాడారు.
తనకు వచ్చే జీతం పేదలకే అందజేస్తానని, ఐదేళ్ల వరకు పైసా ఖర్చు లేకుండా నియోజకవర్గ ప్రజలకు నీలిమా హాస్పిటల్లో వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేవరకు పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు పాల్గొన్నారు.