మణుగూరు, వెలుగు: మణుగూరు మున్సిపాలిటీలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సుందరయ్య నగర్, శ్రీశ్రీ నగర్, మేదర బస్తి ఏరియాలో స్థానిక ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులు నిర్వహించడం లేదని, కాలువల్లో చెత్త పూడుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్ట్రీట్ లైట్లు లేక చీకట్లో నడవాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
వెంటనే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే పదేండ్లుగా మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని, యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కట్టువాగు నుంచి వచ్చే వరద వల్ల సుందరయ్య నగర్ లోని లోతట్టు ప్రాంతాలు, మేదరబస్తీ ఏరియాలో ఇండ్లు మునిగిపోతున్నాయని, వెంటనే కాంక్రీట్ వాల్స్ ఏర్పాటు చేసేలా నివేదికలు సిద్ధం చేయాలని కమిషనర్ కు సూచించారు. మేదరబస్తీ వద్ద లో లెవెల్ బ్రిడ్జిని నిర్మిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. శ్రీశ్రీనగర్ లోని ఫైర్ స్టేషన్ లోకి వరద రావడంతో సిబ్బంది పడుతున్న ఇబ్బందిని తెలుసుకొని వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం
మణుగూరులోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ పై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించడం లేదని తెలుసుకొని వార్డెన్ ను మందలించారు. రికార్డు బుక్ లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.