నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ..? : రఘునందన్ రావు

నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ..? : రఘునందన్ రావు

వెలుగు, తొగుట (దౌల్తాబాద్): నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజైనా ఆ దిశగా అడుగులు వేసిందా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. శనివారం దౌల్తాబాద్ మండలంలోని కొనాయిపల్లి, దిపాయంపల్లి, శేర్ పల్లి, బందారం, నర్సంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదలందరికీ డబుల్ బెడ్రూం కట్టిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులు పదేండ్ల నుంచి కొలువుల కోసం ఎదురుచూస్తుంటే ఒక్క నోటిఫికేషన్​పూర్తిచేయలేదన్నారు.

దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గవర్నమెంట్​హాస్పిటల్​కు మరో ఇద్దరు డాక్టర్లను ఇచ్చి 24 గంటల వైద్య సదుపాయం అందించాలని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇస్తే ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. రాత్రిపూట జ్వరం వస్తే ఒక్క టాబ్లెట్ దొరకదు కానీ గ్రామాల్లో అర్ధరాత్రి వరకు మద్యం ఏరులైపారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పది లక్షల కోట్ల మద్యం విక్రయిస్తే ఇప్పుడు 50 లక్షల కోట్లకు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొలువుల భర్తీ చేస్తామన్నారు.  55 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్​ ఇస్తామన్నారు. బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ప్రజలు ఆలోచన చేసి బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు  కిషన్, నాయకులు రంజిత్, శ్రీకాంత్, సురేందర్ రెడ్డి, రాజు, హన్మంతు, భాను, నగేశ్​పాల్గొన్నారు.