చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నట్టు తప్పుడు లెక్కలు

చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నట్టు తప్పుడు లెక్కలు
  • ఔటర్ రింగు రోడ్డు చుట్టూ డబుల్ బెడ్రూం ఇళ్లు జనవరి 1లోగా పంపిణీ చేయాలి
  • పెద్ద అంబర్ పేట బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడుత ముగింపు సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాదులో చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అసలు రాంకీ సంస్థ చెత్త నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద అంబర్ పేట బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర 4వ విడుత ముగింపు సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంకీ సంస్థకు కేసీఆర్ ప్రభుత్వం దోచిపెడుతోందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి అని గుర్తు చేస్తూ.. జవహర్ నగర్ లో కృత్రిమ డంప్ యార్డును సృష్టించిన చరిత్ర కేసీఆర్ దేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హడ్కో నుంచి రూ.60 వేల కోట్ల రుణం తీసుకుందని.. నెలకు రూ.600 కోట్లు వడ్డీ చెల్లిస్తోందన్నారు. 

ఔటర్ రింగు రోడ్డు చుట్టూ డబల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడిస్తారు ?

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించిన 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని  ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. వచ్చే 2023 సంవత్సరం జనవరి 1వ తేదీలోగా ప్రభుత్వం లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోతే.. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. 

హుజూరాబాద్కు దళితబంధు.. మునుగోడుకు గిరిజనబంధు.. ఉప ఎన్నిక తర్వాత అన్నీ బంద్

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు వచ్చింది.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కు గిరిజన బంధు వచ్చింది.. ఈ బంధులన్నీ కేవలం ఉప ఎన్నికల కోసమే. ఉప ఎన్నిక తర్వాత అన్నీ బంద్ అవుతాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించని కేసీఆర్, ఇశాళ కొత్త సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు అని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పంజాగుట్టలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే అక్కడ పెట్టి.. తప్పు జరిగింది అని లెంపలేసుకుని... అప్పుడు సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే ప్రధానికి మొహం చూపించి, పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని, ప్రధానికి దండం పెట్టి దరఖాస్తు చెయ్ అని సవాల్ విసిరారు. 

ధరణి పేరుతో దండుకున్న వేల కోట్లు కక్కిస్తాం

రాష్ట్రంలో ధరణి పేరుతో డబ్బులు దండుకుంటున్నారని.. ఒక్క రంగారెడ్డి జిల్లాలో ధరణి పేరుతో అధికారులు వేల కోట్లు దండుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి జిల్లాలో అధికారులు దండుకున్న డబ్బులన్నీ కక్కిస్తామని ఆయన హెచ్చరించారు.