చర్లపల్లి జైలు నుంచి రాజాసింగ్ రిలీజ్

చర్లపల్లి జైలు నుంచి రాజాసింగ్ రిలీజ్

గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నమోదుచేసిన పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు షరతుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి వెళ్లిపోయారు.

సంబరాలు..
ఎమ్మెల్యే రాజసింగ్పై హైకోర్టు పీడీయాక్టును ఎత్తేయటంతో బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.పెద్దఎత్తున బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు...టపాసులు కాల్చారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.   తీన్మార్ డ్యాన్సులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ధర్మం గెలిచింది..
పీడీయాక్టును ఎత్తివేయడంతో పాటు..బెయిల్ మంజూరు కావడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ధర్మం విజయం సాధించిందని ట్విట్టర్ లో తెలిపారు.  మరోసారి మీ సేవకు పాత్రున్ని కాబోతున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా శ్రీరాముడు విగ్రహంతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. 

షరతులతో బెయిల్..
ఎమ్మెల్యే రాజాసింగ్పై తెలంగాణ ప్రభుత్వం ప్రయోగించిన పీడీ యాక్ట్ను హైకోర్టు ఎత్తివేసింది. ఈక్రమంలో న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టకూడదని రాజాసింగ్ను ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని నిర్దేశించింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అభ్యంతరకర పోస్ట్ లు, కామెంట్స్ చేయకూడదని తెలిపింది. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత బెయిల్ పై రాజాసింగ్ బయటకు వచ్చారు. 

రెండు నెలలుగా జైల్లోనే..
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో సెప్టెంబర్ 2 న రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే (సెప్టెంబర్ 5న) ఆయనపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుంచి.. అంటే దాదాపు రెండు నెలలుగా రాజాసింగ్ జైల్లోనే ఉంటున్నారు. ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తేయాలంటూ బీజేపీలోని సెకండ్ క్యాడర్, హిందుత్వ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చివరకు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా వారి ముందు రాజాసింగ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, పలు హిందూ సంఘాలు నిరసనలకు దిగారు. రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడంతో ప్రజలు, హిందుత్వవాదులు, పార్టీ క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయనే అభిప్రాయం వ్యక్తమైంది.