న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న పశ్చిమ బెంగాల్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా జయరాంబటి-బరోగోపినాథ్ పూర్- మైనపూర్ మధ్య కొత్త రైలు మార్గాన్ని ప్రారంభిస్తారు. దాంతోపాటు బరోగోపినాథ్‌పూర్ వద్ద హాల్ట్‌తో కూడిన కొత్త రైలు సేవను కూడా జెండా ఊపి ప్రారంభిస్తారు.
అదే సందర్భంగా కొల్‌కతా (సంత్రాగచ్చి) ~- తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోల్‌కతా (హౌరా)~ ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోల్‌కతా (సీల్దా) ~- బనారస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి నాలుగు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని వర్చువల్‌గా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు.
ఈ రైళ్లు బెంగాల్, అస్సాం, బీహార్ వంటి ప్రాంతాల నుంచి దక్షిణ భారత్, ఉత్తర భారత్‌కు సులభమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఈ ప్రాజెక్టులు రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తూ, ఆర్థిక వృద్ధి, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి బలమైన దోహదం చేయనున్నాయి. ఇది వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా జరుగుతున్న ఇంటర్-సిటీ రైలు మొబిలిటీ ఆధునీకరణకు మరో మైలురాయిగా నిలవనుంది.
నేడు 11 కొత్త రైళ్లు ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సహా 11 కొత్త రైళ్లను శనివారం ప్రారంభించనున్నారు. స్లీపర్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని కామాఖ్య (గువాహటి) నుంచి బెంగాల్‌లోని హౌరా మధ్య నడవనుంది. దీన్ని మాల్దా టౌన్ స్టేషన్ నుంచి ప్రదాని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. రెగ్యులర్ సర్వీసులు జనవరి 18 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. 823 మంది ప్యాసింజర్లు ట్రావెల్ చేయవచ్చు. కవచ్ సేఫ్టీ సిస్టమ్, ఆటోమేటిక్ డోర్లు, ఎర్గోనామిక్ బెర్త్‌లు, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, సీసీటీవీ, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
