- వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్
హనుమకొండ/యాదాద్రి, వెలుగు : ‘భూ భారతి’ స్లాట్ బుకింగ్ టైంలో చలాన్లు మార్ఫింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన కేసులో యాదాద్రి, జనగామ జిల్లాలకు చెందిన 15 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ శుక్రవారం వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన పసునూరి బస్వరాజు, రాజాపేటకు చెందిన జెల్ల పాండు, గుండాలకు చెందిన మహేశ్వరం గణేశ్‌కుమార్ ఆన్‌లైన్ సెంటర్ నిర్వహించేవారు. ఈ క్రమంలో భూ భారతి స్లాట్ బుకింగ్ కోసం వచ్చే రైతుల నుంచి డబ్బులు తీసుకొని.. ప్రభుత్వానికి 10 శాతం మాత్రమే చెల్లించి.. మిగతా సొమ్మును కాజేసేవారు.
అనంతరం భూ భారతి వెబ్‌సైట్‌లో చలాన్‌ను ఎడిట్ చేసి ఆ కాపీని రైతులకు ఇచ్చి పంపించేవారు. తర్వాత స్థానిక తహసీల్దార్, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మీడియేటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించేవారు. ఇలా యాదాద్రి, జనగామ జిల్లాల్లో మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లను సంబంధించిన చలాన్లను ఎడిట్ చేసి రూ.3.90 కోట్లు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంలో మీసేవ, ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులకు ఒక్కో లావాదేవికి 10 నుంచి 30 శాతం వరకు కమీషన్‌గా అందేది.
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మీ సేవ సెంటర్ నిర్వాహకుడి ద్వారా ఈ వ్యవహారం బయటపడడంతో గత నెలలో రిజిస్ట్రేషన్ చేసిన పది డాక్యుమెంటర్లకు సంబంధించి రూ. 8.55 లక్షలు తక్కువగా జమ అయినట్లు జనగామ తహసీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జనగామలోని మీ – సేవ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకోగా, వారిచ్చిన సమాచారంతో యాదగిరిగుట్టలో బస్వరాజును అదుపులోకి తీసుకొని సీపీయూ, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి యాదాద్రి జిల్లాలో 15, జనగామ జిల్లాలో 7 కేసులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు పసునూరి బస్వరాజు, జెల్లా పాండు, మహేశ్వరం గణేశ్‌కుమార్‌తో పాటు జనగామ జిల్లాకు చెందిన శ్రీనాథ్, ఎనగందుల వెంకటేశ్, కోదురి శ్రావణ్, కొలిపాక సతీస్‌కుమార్, రంజిత్‌కుమార్, యాదాద్రి జిల్లాకు చెందిన దుంపల కిషన్‌రెడ్డి, మేగావత్ దశరథ్, నారా భానుప్రసాద్, జి. శ్రీనాథ్, ఆలేటి నాగరాజు, ఒగ్గు కర్నాకర్, కమల, నల్గొండకు చెందిన శివకుమార్‌ను అదుపులోకి తీసుకోగా మరో 9 మంది పరార్ అయ్యారు.
నిందితుల నుంచి రూ.63.19 లక్షలు, బ్యాంక్ అకౌంట్‌లో రూ.లక్ష, రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండరి చేతన్, జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డిని సీపీ అభినందించారు.
