హనుమకొండ/ధర్మసాగర్ : నేషనల్ ఖోఖో 58వ సీనియర్ చాంపియన్ షిప్ ను మహారాష్ట్ర, రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ గెలిచాయి. కాజీపేట రైల్వే స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్స్ ఉత్కంఠ భరితంగా సాగాయి. ఫైనల్లో మహారాష్ట్ర మహిళల జట్టు ఒక పాయింట్ (23–22) తో ఒడిశాను ఓడించింది.
పురుషుల రైల్వేస్ జట్టు వరుసగా రెండోసారి ఛాంపియన్ షిప్ సాధించింది. ఐదు పాయింట్ల (26- – 21) తో మహారాష్ట్రను మట్టి కరిపించింది. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో కొల్హాపూర్, ఒడిశా, మహిళల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ జట్లు నిలిచాయి.
చాంపియన్ షిప్ లో ప్రతిష్టాత్మక ఏకలవ్య అవార్డుతో పాటు బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డును రాంజీ కశ్యప్ (రైల్వేస్), రాణి లక్ష్మి అవార్డుతో సహా బెస్ట్ ఆల్ రౌండర్ ను సంధ్య సుర్వసే (మహారాష్ట్ర) అందుకున్నారు.
వీరికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు భంవార్ సింగ్ పలాడ, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉప్ కార్ సింగ్ విర్క్ , ఫెడరేషన్ టోర్నమెంట్స్ చైర్మన్ ఎం ఎస్ త్యాగి, ఫెడరేషన్ ఎథిక్స్ కమిషన్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, తెలంగాణ , వరంగల్ జిల్లా అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు నాతి కృష్ణమూర్తి, తోట శ్యాంప్రసాద్, టెక్నికల్ అఫీషియల్స్ రాజారపు రమేశ్, కుసుమ సదానందం , సురేంద్ర విశ్వకర్మ అందజేశారు.
