రోగులను ప్రైవేట్కు తరలిస్తే ఊరుకోను : ఎమ్మెల్యే రామారావు పటేల్

రోగులను ప్రైవేట్కు తరలిస్తే ఊరుకోను : ఎమ్మెల్యే రామారావు పటేల్
  • పరికరాలున్నా ఎందుకు ఉపయోగించుకోవడం లేదు?
  • ఏరియా ఆస్పత్రి డాక్టర్ల పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

భైంసా, వెలుగు: బైంసా ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులను ఏజెంట్లతో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే రామారావు పటేల్​ హెచ్చరించారు. ప్రభుత్వం అత్యాధునిక పరికరాలు ఇచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏరియా హాస్పిటల్​లో రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ సెంటర్​ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 

అనంతరం ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ అధికారులు వాటిని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బేబీ వార్మర్ మిషన్లు, ఐసీయూను ఉపయోగంలోకి తేవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొందరు డాక్టర్లు​సొంతగా ఏజెంట్లను పెట్టి రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకొని పేదలకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. 

సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే డాక్లర్లతో రివ్యూ నిర్వహించి ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. డీసీహెచ్ఎస్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, డాక్టర్లు విజయానంద్, దామోదర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బి.గంగాధర్, భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి  ఉన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

కుంటాల, వెలుగు: సర్పంచ్​లు గ్రామాల అభివృద్ధికి పాటుపడి ప్రజల్లో గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే రామరావు పటేల్ సూచించారు. కుంటాల మండలంలోని కల్లూర్ సర్పంచ్ పెంట దశరథ్, ఉప సర్పంచ్ నారాయణ రావు పటేల్, వార్డు సభ్యులను గురువారం సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. 

బీజేపీ కల్లూర్ మండల ప్రెసిడెంట్ పసుల నవీన్ తండ్రి ఇటీవల చనిపోగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు మౌలానా, సోనేకర్, శ్రీను పటేల్, వెంగల్ రావు, చిన్నారెడ్డి, సాయిపటేల్ ఉన్నారు.