బండారం బయటపడుతుందనే రాహుల్ టూర్కు అడ్డంకులు

బండారం బయటపడుతుందనే రాహుల్ టూర్కు అడ్డంకులు

ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టేందుకు ధైర్యం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. రాహుల్ గాంధీ అక్కడకు వెళ్తే వారి బండారం బయటపడుతుందని సీఎం భయపడుతున్నారని అన్నారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే రైతు సంఘర్షణ సభాస్థలిని పరిశీలించిన అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ నేతనే రావద్దనే దుర్మార్గపు విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. యూనివర్సిటీలను మూసివేసే దిశగా టీఆర్ఎస్ సర్కారు పనిచేస్తోందని సీతక్క అభిప్రాయపడ్డారు. 

రాహుల్ గాంధీ ఓయూకు వెళ్తే విద్యార్థుల సమస్యలు బయటకు వచ్చి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని సీతక్క అన్నారు. కానీ పేద విద్యార్థుల కడుపుకొట్టే కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అనేక యూనివర్సిటీల విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్ట్ అయిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. 

కేసీఆర్ దేశ్ కీ నేత కాదు.. గల్లీకీ నేత కూడా కాదని సీతక్క చురకలంటించారు. ఆయన కుటుంబం దేశం కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. మరో జాతీయపార్టీని ప్రసన్నం చేసుకునేందుకు రాహుల్ గాంధీ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని,  తమ పార్టీ పట్ల జనంలో వ్యతిరేకత లేదని కావాల్సిందల్లా లీడర్ల మధ్య సఖ్యతేనని సీతక్క అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్న ఆమె.. రాహుల్ గాంధీ సభను ఐక్యంగా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

For more news..

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

ఓయూలో ఉద్రిక్తత.. NSUI నేతల అరెస్ట్