అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

హైదరాబాద్: ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం చంచల్ గూడ జైలులోని ఎన్ఎస్యూఐ నేతలను కాంగ్రెస్ నాయకులు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజనీకుమార్ యాదవ్, సంపత్ కుమార్ తదితరులతో కలిసి రేవంత్ పరామర్శించారు. ఈసందర్భంగా ఈ నెల 7న జైల్లో ఉన్న తమ విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్ శివకుమార్ గౌడ్ ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ పేరుతో కేసీఆర్ దొంగ దీక్ష చేసి ఉద్యమాన్ని నీరుగారిస్తే.... శ్రీకాంత చారి, ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి ఎంతో మంది విద్యార్థులు తమ ఆత్మ బలిదానంతో ఉద్యమాన్ని బతికించారని తెలిపారు. ఈ క్రమంలోనే ఓయూతో పాటు రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీల విద్యార్థుల ఉద్యమాన్ని ముందుకు నడిపారని తెలిపారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమన్నారు. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూలో రాహుల్ పర్యటనను అడ్డుకోవడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

క్యాంపస్ లోని విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకోవడానికి రాహుల్ ఓయూకు వస్తానంటే... రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంలేదని ఫైర్ అయ్యారు. తమ విద్యార్థి నాయకులు వీసీతో మాట్లాడి పర్మిషన్ ఇవ్వాలని అడిగితే... వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని తెలిపారు. టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలను వీసీ కాపాడుతున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారన్న ఆయన... రైతుల సమస్యల గురించి రాహుల్ మాట్లాడతారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

మరో మూడ్రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు

ఓయూలో ఉద్రిక్తత.. NSUI నేతల అరెస్ట్