రాజు కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

రాజు కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

వరంగల్: సింగరేణికాలనీ హత్యాచార నిందితుడు రాజు మృతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. రాజు మృతి ప్రజల విజయమని ఆమె అన్నారు. ప్రజలు అన్యాయంపై పోరాటం చేస్తే ఎంతటి దుర్మార్గుడికైనా ఇలాంటి గతే పడుతుందని ఆమె అన్నారు. రాజు తప్పులతో సంబంధంలేని ఆయన కూతురు బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు.

‘ఇది ప్రజల విజయం. గత వారం రోజులుగా చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలి, దుర్మార్గుడు రాజును శిక్షించాలని.. ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తుంటే.. ఈ ప్రభుత్వం తప్పుదారిపట్టించే ప్రయత్నం చేసింది. రాజును అరెస్ట్ చేసినం.. బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తాం అన్నారు. అంతేకాని రాజును శిక్షించలేదు, పట్టుకోలేదు. ప్రజల యొక్క పోరాటాల మూలంగానే.. వానికి వెన్నులో వణుకు పుట్టి.. ఈ రోజు శవమై తేలిండు. ఆత్మహత్య చేసుకున్నడు. ఎవడైనా దుర్మార్గాలకు పాల్పడితే ఇదే గతి పడుతుంది. ప్రభుత్వాలు పట్టించుకోకున్నా.. ప్రజల తిరుగుబాటుకు, ప్రజల పోరాటాలకు భయంతో చావాల్సిన దుస్థితి పడుతుందని.. మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా.. ఇది ప్రజల పోరాట విజయంగా భావించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎలాంటి తప్పు చేయనటువంటి రాజు కుటుంబం, రాజు తప్పులతో సంబంధంలేనటువంటి రాజు బిడ్డను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’ అని సీతక్క అన్నారు.