మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డిని బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్ చేయాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్

మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డిని బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్ చేయాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్

వనపర్తి, వెలుగు: భూ కబ్జాలకు పాల్పడిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్  పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్  చేశారు. ఆదివారం వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చందూర్ గ్రామంలో బినామీల పేర్లపై సర్వే నంబర్ 57 లో 2 ఎకరాల 19 గుంటలు భూమిని కబ్జా చేసినట్లు రుజువు కావడంతో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు.

రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారన్నారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు నిరూపించాలని ఎన్నికల ముందు సవాల్  విసిరిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్​ నేతలు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.22,400 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి చుక్క నీరు ఇవ్వలేదని విమర్శించారు. 90 శాతం పూర్తయ్యాయని చెప్పుకుంటున్న బీఆర్ఎస్​ నేతలు, తాను సీఎం, మంత్రులతో మాట్లాడి రూ.2,700 కోట్లు విడుదల చేయిస్తానని,  ఆ నిధులతో పూర్తి చేసి చూపాలని సవాల్  విసిరారు. ఏఎంసీ చైర్మన్​   శ్రీనివాస్ గౌడ్, పీసీసీ సభ్యుడు శంకర్ ప్రసాద్, దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి పాల్గొన్నారు.