
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గాన్ని రూ.234 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం వనపర్తిలో ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తో కలిసి పట్టణంలోని వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మూడేండ్లలో సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు.
వనపర్తిలో రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. మూడు నెలల్లో రూ.50 కోట్లతో 20 సీసీ రోడ్ల పనులు పూర్తి చేశామని తెలిపారు. హిందూ స్మశాన వాటిక, రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.