జగనన్న కాలనీలు పక్కా స్కామ్ : ఉండవల్లి శ్రీదేవి

జగనన్న కాలనీలు పక్కా   స్కామ్ : ఉండవల్లి శ్రీదేవి

మూడు రోజుల నుంచి  వైసీపీ గూండాలు తనని వేధిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చి తన ఆఫీసుపై దాడి చేయించారని శ్రీదేవి తెలిపారు. గెలిచినప్పటి నుంచి తనపై కుట్ర జరుగుతుందని శ్రీదేవి ఆరోపించారు.  వైసీపీ దందాలకు  అడ్డొస్తున్నానని తనని టార్గెట్ చేశారని వాపోయారు. అమరావతిలో 10 శాతమైనా అభివృద్ది చేశారా అని ప్రశ్నించారు.

జగనన్న కాలనీలు పక్క స్కామ్ అని శ్రీదేవి ఆరోపించారు. తాను టీడీపీకి ఓటు వేశానో లేదో వారికెలా తెలుసునని ప్రశ్నించారు.  వైఎస్సాఆర్ తనయుడు పార్టీ అంటే విలువలు ఉంటాయని అనుకుని వైసీపీలో చేరానని.. కానీ జగన్ అలాంటి వ్యక్తి కాదన్నారు. ఈ విషయం తనకు ముందే తెలిస్తే అసలు చేరేదాన్ని కాదని తెలిపారు.  ప్రాణం ఉన్నంత వరకు అమరావతి రైతుల కోసం పోరాడుతానని చెప్పారు. తాను ఇక నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని, తనకు ఏ పార్టీ ట్యాగ్ లేదన్నారు . జగన్ చేసిన పనికి మైండ్ బ్లాక్ అయిందని, త్వరలో రిటర్న్ గిప్ట్ ఇస్తానని శ్రీదేవి వెల్లడించారు.