
మక్తల్, వెలుగు: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. ఇక నుంచి నియోజకవర్గ ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట, మహబూబ్నగర్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం పట్టణంలోని ఆసుపత్రిలో ఐదు పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ సేవలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను జనవరిలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారని, అయితే ఆసుపత్రిలో సౌలతులు లేక అందుబాటులోకి తేలేక పోయామని చెప్పారు.
దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేశాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో మక్తల్ నియోజవర్గంలో డయాలసిస్ సెంటర్ ను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. డయాలసిస్ సెంటర్ నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. త్వరలో 150 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వినీత, మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ , మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గణేశ్ కుమార్, రవి కుమార్, చంద్రకాంత్ గౌడ్, కోళ్ల వెంకటేశ్ పాల్గొన్నారు.