నా పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకోను : వివేక్​ వెంకటస్వామి

నా పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకోను : వివేక్​ వెంకటస్వామి
  • అలాంటివారిపై అధికారులు చర్యలు తీసుకోవాలె
  • ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలె 
  • టోల్​గేట్, సీసీ కెమెరాలు, వేబ్రిడ్జి ఏర్పాటుకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదేశాలు

కోల్​బెల్ట్/జైపూర్/చెన్నూర్, వెలుగు: తన పేరు చెప్పుకొని చట్టవిరుద్ధమైన పనులు చేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు, రెవెన్యూ అధికారులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం చెన్నూర్​లోని తన క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొందరు తన పేరు చెప్పుకొని దందాలకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని సహించవద్దని అధికారులకు సూచించారు. చెన్నూర్ నుంచి ఇష్టారీతిన ఇసుక లారీలు పోవడంతో రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయని, సింగరేణికి ఇసుక రవాణా పేరుతో ఓవర్​లోడ్​తో లారీలు పోతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. 

ఇలాంటి వాటికి చెక్​ పెట్టేందుకు టోల్​గేట్, సీసీ కెమెరాలు, వేబ్రిడ్జిని అందుబాటులోకి తీసుకరావాలన్నారు. ఇల్లీగల్​ఇసుక రవాణా చేస్తే లారీలను సీజ్​ చేయాలని, ఎంతటివారినైనా వదలొద్దని ఆదేశించారు. పోడు పట్టాల సమస్యను ఉట్నూర్​లో జరిగిన రైతు భరోసా సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లానని, స్పందించిన ఆయన కలెక్టర్​ కుమార్ ​దీపక్​ను ఆదేశిస్తూ పట్టాలున్న గిరిజనులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని సూచించారని అన్నారు. సేద్యం చేసుకునే రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. అంతకు ముందు పోడు వ్యవసాయం, పట్టాల అంశాలపై కలెక్టర్, జిల్లా అటవీ అధికారి అశిష్ ​సింగ్​చౌహాన్, ఎఫ్​ఆర్​వో రమేశ్​తో ఎమ్మెల్యే వివేక్​ రివ్యూ నిర్వహించారు. 

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. మందమర్రిలో రూ.22.90 కోట్లతో రైల్వే ఆర్వోబి రోడ్డు బ్రిడ్జిని, మందమర్రి ఫోటో గ్రాఫర్స్​ అసోయేషన్​ ఆధ్వర్యంలో నిర్మించిన ఫోటో భవన్​ను ప్రారంభించారు. భీమారం మండల కేంద్రంలో రూ.10లక్షలతో నిర్మించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కమ్యూనిటీ భవనం, చెన్నూర్​లో రూ.1.60 కోట్లతో 33/11కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్, కోటపల్లి మండలం నక్కలపల్లిలో రూ.20లక్షతో గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. 

జైపూర్​ మండల కేంద్రంలో అర్హులైన 39 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. జైపూర్ మండల కేంద్రానికి చెందిన తాటిపల్లి శ్రీనివాస్ చిన్న కొడుకు హరీశ్ రెండ్రోజుల క్రితం గుండె పోటుతో చనిపోగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ జడ్పీ వైస్​ ప్రెసిడెంట్​ మూల రాజిరెడ్డి, బెల్లంపల్లి, జైపూర్​ఏసీపీలు రవికుమార్, వెంకటేశ్వర్లు, ఆర్​అండ్​బీ, ట్రాన్స్​కో అధికారులు, చెన్నూర్ మున్సిపల్​ చైర్​పర్సన్ అర్చనా రాంలాల్ ​గిల్డా, మందమర్రి, చెన్నూరు మున్సిపల్​ కమిషనర్లు, అధికారులు, కాంగ్రెస్​లీడర్లు పాల్గొన్నారు.