చెన్నూర్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : వివేక్ వెంకటస్వామి

చెన్నూర్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా :  వివేక్ వెంకటస్వామి
  • సమస్యల పరిష్కారానికి కృషి అభివృద్ధికి ప్రజలు సహకరించాలే 
  • చెన్నూర్ వార్డుల్లో ఎమ్మెల్యే వివేక్ మార్నింగ్ వాక్ 

చెన్నూర్/కోటపల్లి, వెలుగు: చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, అందుకు ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మార్నింగ్ వాక్​లో భాగంగా ఆదివారం చెన్నూర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ వాడ, మారమ్మ వాడ, బేతాళ వాడల్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదేశించారు. ప్రయారిటీ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే అన్నారు.

రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, కరెంట్ పోల్స్, నీటి సమస్యను 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన  కోటపల్లి మండలం పారిపల్లి, లింగన్న పేట, ఎదుల బంధం, రొయ్యలపల్లె, అల్గాం గ్రామాల్లో పర్యటించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పోడు భూముల సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎదులబంధంలో రు.5 లక్షలతో సీసీ రోడ్డు వేస్తామని, రొయ్యలపల్లిలో డ్రైనేజ్ నిర్మించి ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. చెన్నూరు పట్టణం ఎమ్మెల్యే కాలనీలో నిర్వహించిన పెద్దమ్మ  బోనాలకు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. దేవతామూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

కోటపల్లి మండలంలోని జనగామ మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్ తల్లి కిష్టబాయి, సిర్ష గ్రామంలోని నాగుల రాజేశ్వర్ రెడ్డి సంవత్సరీక కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ చెన్నూర్ పట్టణ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, అయిత హేమంత రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గొడిసెల బాపిరెడ్డి, సుధాకర్ రెడ్డి, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ పోటు రామిరెడ్డి, కోటపల్లి మండల అధ్యక్షుడు మహేశ్ ప్రసాద్ తివారీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజమల్ల గౌడ్, రవి, బానేశ్, లక్ష్మణ్, రాజబాపు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.