మత్తడి పేల్చివేసినోళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టం

మత్తడి పేల్చివేసినోళ్లు ఎంతటివారైనా వదిలిపెట్టం
  • సంబంధం లేకుంటే బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఎందుకు పరారైన్రు?
  • నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశం: వివేక్ వెంకటస్వామి  
  • ఇసుక, కబ్జాలు, బియ్యం, డ్రగ్స్ దందాలు చేసేవాళ్లనూ వదలొద్దని సూచన 

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడిని బ్లాస్ట్ చేసిన ఘటనలో సూత్రధారులు ఎంతటివారైనా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. కొందరు నిందితులను మాత్రమే పట్టుకున్న పోలీసులు అసలు సూత్రధారులను మాత్రం వదిలివేయడం పట్ల ఆయన ఆశ్యర్చం వ్యక్తం చేశారు. బుధవారం వివేక్ ఈ మేరకు ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చెన్నూరులో ఇసుక, భూకబ్జా, బియ్యం, డ్రగ్స్ దందాలను బంద్ చేయించానని తెలిపారు.

ఈ దందాల్లో ఇన్​వాల్వ్ అయినవారు ఎంతటి పెద్దవారైనా అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చానని, ఆ మేరకు నిందితులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇటీవల శనిగకుంట చెరువు మత్తడిని సింగరేణి డిటోనేటర్లు పెట్టి పేల్చివేయడం ప్రజలను ఆందోళనకు గురిచేసిందన్నారు. ఈ ఘటనకు  కారకులైన కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. కానీ పేల్చివేత జరిగి ఇన్ని రోజులైనా అసలు సూత్రధారులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అరెస్టయిన వారి కాల్ రికార్డులను పరిశీలిస్తే సూత్రధారులెవరో తెలిసిపోతుందని పోలీసులకు సూచించారు. 

ఆ లీడర్లు ఎందుకు పారిపోయిన్రు?  

నిందితులను తాను కాపాడుతున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. మత్తడి పేల్చివేతతో సంబంధం ఉన్నట్టు  పోలీసులు ప్రకటించిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఎందుకు చెన్నూరు విడిచి పరార్ అయ్యారో చెప్పాలన్నారు. వారి ఇన్​వాల్వ్​మెంట్ లేకపోతే పోలీసుల ముందుకొచ్చి నిజాలు చెప్పి విచారణకు సహకరించాలని డిమాండ్​ చేశారు. ఈ ఘటన వెనక ఉన్న సూత్రధారులను 24 గంటల్లో అరెస్టు చేయాలని రామగుండం సీపీని ఆదేశించినట్టు చెప్పారు. చెన్నూరులో పేకాట, డ్రగ్స్ మాఫియా పెరిగిందని వీటిని అరికట్టేందుకూ పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలతో కూడిన స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేలా కృషి చేస్తానని, ప్రజలు  సహకరించాలని కోరారు.