బీఆర్ఎస్ పాలనతో విద్యా వ్యవస్థ ధ్వంసం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనతో విద్యా వ్యవస్థ ధ్వంసం : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: బీఆర్ఎస్​ పదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. డైట్  కాలేజీ రిటైర్డ్​ లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ప్రభుత్వ బీఈడీ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఎన్ని ఏండ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఏడాదికి రూ.72 వేల కోట్లు మిత్తీలకే కడుతున్నామని, రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను గాడిన పెట్టేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నామన్నారు. 

నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి విద్యా సంవత్సరంలోనే 9 వేల స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్  పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాలమూరులో విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇస్తే, సీఎంకు అందజేసి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగపతిరావు, విజయ్ కుమార్, ప్రతాప్ రెడ్డి, మహబూబ్ నగర్  ఫస్ట్  పర్యవేక్షకుడు గుండా మనోహర్  పాల్గొన్నారు.