
- అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచన.. 74 పేజీలతో తీర్పు
- ‘ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్’ అనే పరిస్థితి రానివ్వొద్దు
- అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి
- న్యాయస్థానమే అనర్హత వేటువేయాలన్న అభ్యర్థనకు నో
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచిస్తూ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొంది. తీర్పు వెలువరించిన నాటి నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఈ వ్యవహారంలో నిరుడు నవంబర్ 22న రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. పార్టీ మారిన వారిపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌తో కూడిన ధర్మాసనం గురువారం 74 పేజీల తీర్పును వెలువరించింది.
సుదీర్ఘ వాదనల తర్వాత..!
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్పీ)ను దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీపై కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో 9 సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జస్టిస్ హోదాలో బీఆర్ గవాయ్ ముందు నుంచి ఈ పిటిషన్లపై విచారణ చేపట్టగా... పిటిషనర్ల తరపు సీనియర్ అడ్వకేట్లు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావు.. స్పీకర్, ప్రతివాదుల తరఫున సీనియర్ అడ్వకేట్లు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి, రవి శంకర్ జంధ్యాల, గౌరవ్ అగర్వాల్, నిరంజన్ రెడ్డి, పలువురు వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 3 న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పును వెలువరించింది.
‘ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్’ అనేలా ఉండొద్దు
ఈ కేసులో స్పీకర్ కు సూచనలు జారీ చేయకపోతే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్నే దెబ్బతీస్తుందని, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని రిపీట్ చేసినట్లవుతుందని తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలా ఉండకూడదనే సూచనలు చేస్తున్నట్లు తెలిపింది. ‘‘పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు నిర్ణయించాలి. ఏ ఎమ్మెల్యే విచారణను కూడా పొడిగించడానికి అనుమతించొద్దు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని అభిప్రాయపడింది. 10వ షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యూనల్ గా పని చేస్తున్నప్పటికీ.. ఎటువంటి ‘‘కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ’’ని పొందలేరని తెలిపింది. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడిగించడానికి అనుమతించొద్దని స్పీకర్‌కు కోర్టు సూచించింది. కిహోటో హోల్లొహన్(10 వ షెడ్యూల్ సమర్థించిన) తీర్పు నిష్పత్తిని ప్రస్తావిస్తూ... స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష అధికారాలు ఇరుకైన పరిధిలో (న్యారో కంపాస్) ఉన్నాయని పేర్కొంది. అలాగే స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదని కిహోటో హోల్లొహన్ తీర్పును ఊటంకించింది. ఇక, అనర్హతకు సంబంధించిన పిటిషన్లను స్పీకర్ లు ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చని పేర్కొంది.
అలాగే.. ఇలాంటి పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఘ్ కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించింది. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లనను నిర్ణీత సమయంలోగా నిర్ణయించాలంటూ మహారాష్ట్ర స్పీకర్ కు జారీ చేసిన ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కోర్టులే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ అభ్యర్థనలను ప్రస్తావిస్తూ... కిహోటో హోల్లోహన్, సుభాష్ దేశాయ్ కేసుల్లో పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుంటూ, న్యాయస్థానాలే అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నట్లు తీర్పులో సీజేఐ జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ పున:పరిశీలించాలి
అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పున: పరిశీలించాలని సీజేఐ ధర్మాసనం తీర్పులో సూచించింది. ‘‘రాజకీయ ఫిరాయింపులు జాతీయ ఆందోళన అంశం. దీన్ని ఎదుర్కోకపోతే.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది’’ అని పేర్కొంది. ‘‘మాకు ఎలాంటి సలహా అధికారం లేదు. అయినా అనర్హతపై స్పీకర్/చైర్మన్లకు కల్పించబడిన హక్కులు రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా ఎదుర్కోగలవా? లేదా అనేది పార్లమెంట్ ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టే సూత్రాలను కాపాడుకోవాలంటే.. ఈ విధానం సరిపోతుందా? లేదా ? అనేది పున:పరిశీలించాలి. ఇలాంటి అనర్హత పిటిషన్లలో లోపాలు పునరావృతం కాకూడదంటే.. దానిపై నిర్ణయం తీసుకోవడం పార్లమెంట్ బాధ్యత అని మేం భావిస్తున్నాం’’ అని అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.