కోల్​బెల్ట్​ ఏరియాలోని ఎమ్మెల్యేలే టార్గెట్​

కోల్​బెల్ట్​ ఏరియాలోని ఎమ్మెల్యేలే టార్గెట్​
  • వీరి కనుసన్నల్లోనే ల్యాండ్, సాండ్​ మాఫియా 
  • ఉద్యోగాల పేరుతో అనుచరుల వసూళ్ల పర్వం 
  • కోల్​బెల్ట్​ ఏరియా సెక్రటరీ పేరిట ఇటీవల బహిరంగ లేఖ విడుదల 

మంచిర్యాల, వెలుగు: కోల్​బెల్ట్ ​ఏరియాకు చెందిన ముగ్గురు టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు మావోయిస్టుల హిట్​లిస్టులో ఉన్నారనే విషయం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలు, వారి అనుచరుల ఆగడాలను బహిర్గతం చేస్తూ మావోయిస్టు పార్టీ కోల్​బెల్ట్​ ఏరియా కమిటీ సెక్రటరీ ప్రభాత్​ పేరిట ఇటీవల బహిరంగ లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్​ఎమ్మెల్యేల అండతో ఈ ప్రాంతంలో రౌడీయిజం, భూకబ్జాలు, సెటిల్​మెంట్లు, మహిళలపై వేధింపులు పెరిగాయని అందులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ల్యాండ్, సాండ్​మాఫియా పెట్రేగిపోతోందని, సింగరేణి, ఎస్టీపీపీ, ఆర్ఎఫ్​సీఎల్, ఇతర సంస్థల్లో ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి సామాన్యులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు ఆర్ఎఫ్​సీఎల్​లో జాబ్స్​ పెట్టిస్తామని రూ.80 కోట్ల దాక దండుకున్నారని, బాధితులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఇసుక మాఫియాకు అండగా నిలిచి కోట్లకు పడగలెత్తారని లెటర్​లో ప్రస్తావించారు. ఆయన అనుచరులు చెన్నూర్​ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేయడమే కాకుండా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు మహిళలను లొంగదీసుకోవడం, విహార యాత్రలకు తీసుకెళ్లడం వంటి అనైతిక కార్యకలపాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో ప్రభుత్వ, అసైన్డ్​ భూములను కబ్జా పెడుతున్నారని ధ్వజమెత్తారు. మరో సీనియర్​ ఎమ్మెల్యే తీరును సైతం తప్పుపట్టారు. పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని సామాన్య ప్రజలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. వీరు తమ పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.  

అప్రమత్తమైన పోలీసులు  

ఎమ్మెల్యేలు సరైన భద్రత లేకుండా గ్రామాల్లో పర్యటించవద్దని, తప్పనిసరైతే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని, పరిస్థితి అదుపులోకి వచ్చేదాక హైదరాబాద్​కు పరిమితం కావాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు సమాచారం. తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్​లోని ప్రాణహిత, గోదావరి తీర ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్​పేరుతో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.