మిషన్ భగీరథ పథకంలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమా ?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మిషన్ భగీరథ పథకంలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమా ?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

గ్రామాల్లో సర్పంచుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గ్రామ పంచాయితీల్లో సర్పంచ్లు తమ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని..అయితే రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను మంజూరు చేయకపోవడంతోనే అప్పులబాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. గ్రామాల్లో ఎక్కువగా అభివృద్ధి పనులను టీఆర్ఎస్ నాయకులే చేస్తున్నారని, వాళ్ల పార్టీ నాయకులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత..తమ తండ్రి సీఎం కేసీఆర్తో చర్చించి..గ్రామ పంచాయితీలకు బిల్లులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

రాయికల్ పట్టణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత అబద్దపు హామీలు ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రాయికల్ పట్టణాన్ని రూ.25కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన ఎమ్మెల్సీ కవిత...హౌస్ ట్యాక్సులు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయికల్ పట్టణానికి డిగ్రీ కాలేజీ తెచ్చామని చెప్పిన కవిత.. ఆ నిర్మాణం ఎక్కడ ఉందో చూపెట్టాలని డిమాండ్ చేశారు. పదే పదే మిషన్ భగీరథతో తాగు నీరు ఇచ్చామని చెప్పుకునే ఎమ్మెల్సీ కవిత..ఆ పథకంలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 2019 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిత్రులుగా ఉన్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. రామగుండంలో ఆర్ఎఫ్ సీఎల్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వెళ్లకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రశ్నించే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్పోయారని అన్నారు.